
వేలం ప్రక్రియలో మణుగూరు సమీపంలోని ఓపెన్ కాస్ట్ డిప్‌సైడ్ బ్లాక్‌ను దక్కించుకున్న సింగరేణి
పికెఒసిలో 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.10,000కోట్ల ఆదాయం
6,500 మందికి జీవనోపాధి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పికెఓసి (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తాలు ఉన్నాయని, తద్వారా ప్రతి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ మైన్ పొందవచ్చని ఆయన చెప్పారు. దీంతో దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు వేసిందని అన్నారు.
ఇటీవలే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో పికెఓసి డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయని తెలిపారు. పికెఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్నిరకాలుగా బాధ్యత వహించి మంత్రిగానే కాకుండా తెలంగాణ బిడ్డగా సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి, సింగరేణి కార్మికులను ప్రేమించే వ్యక్తిగా ప్రత్యేక కృషిన ఫలితంగా సింగరేణి విజయం సాధించడం చాలా సంతోషకరమన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం (3న) వేలం ప్రక్రియ పూర్తయైందని, ఈ విధానంలో సింగరేణి సంస్థకు మణుగూరు పికెఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయించడం జరిగిందన్నారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి సంస ఇక్కడ దొరికే జి-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా మొత్తం రూ. 43 వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుందన్నారు.
6,500 మందికి జీవనోపాధి
దీని వల్ల తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతో పాటుగా సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా 3 బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారత దేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర ప్రాంతంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు.
సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి, సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 3 బొగ్గు గనులు సింగరేణి సాధించడం ఒక శుభపరిణామం అన్నారు. నైని, తాడిచర్ల-2, పికెఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్ రావడంతో సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వ్ సమకూరుతాయని ఆయన తెలిపారు. ఇంకా 6,500 మందికి జీవనోపాధి లభిస్తుందని ఆయన వివరించారు. సగటున 35 ఏళ ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఈ 3 బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.











