వివాహం చేసుకుంటానని నా కుమారుడి నుంచి రూ.9.88 కోట్లు వసూలు చేసింది

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిందనే ఫిర్యాదు మేరకు సినీనటి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి తన కుమారుడి వద్ద అషురెడ్డి, ఆమె సోదరి దివ్యారెడ్డి, కుటుంబ సభ్యులు రూ.9.83కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్, షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ధర్మేంద్ర 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో వెంకట అశ్విని రెడ్డి కొయ్య(అషు రెడ్డి) పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పింది.

పరిచయమైన కొద్ది రోజుల్లోనే అషురెడ్డి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించింది, తరచూ అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. ధర్మేంద్ర వద్ద తీసుకున్న డబ్బులతో కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేసి తన పేరుపై రిజిస్టర్ చేయించుకుంది. పెళ్లి చేసుకుంటానని ధర్మేంద్ర నుంచి 5 కిలోల బంగారం, ఉండటానికి ఫ్లాట్ కావాలని చెప్పి రూ.3 కోట్ల విలువైన విల్లాకు అడ్వాన్స్ ఇప్పించిందని ఇలా, రూ.9.83 కోట్లు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అషురెడ్డి తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి ఈ డ్రామా ఆడిందని, వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని ’హనీట్రాప్’ చేసిందని బాధితుడి తండ్రి ఫిర్యాదులో వివరించారు. అషురెడ్డి సోదరి దివ్యారెడ్డికి కూడా తన కుమారుడు ధర్మేంద్ర రూ.50 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు అషురెడ్డి తండ్రి ధర్మేంద్ర వద్ద నుంచి డబ్బులు తీసుకున్నది నిజమని పేర్కొన్నారు. ధర్మేంద్రకు ఇది వరకే వివాహం అయి విడాకులు అయ్యాయని, ఇది తెలిసి కూడా పెళ్లి చేసేందుకు అంగీకరించామని అషు రెడ్డి తండ్రి తెలిపారు.

లీగల్ యాక్షన్ తీసుకుంటా: అషురెడ్డి, సినీనటి

తనపై అసత్య ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సినీనటి అషురెడ్డి హెచ్చరించారు. తన పై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. పెళ్లి పే రుతో రూ.9.83 కోట్లు కాజేశాననేది అవాస్తవమని చెప్పుకొచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యా క్షన్ తీసుకుంటానని అషురెడ్డి హెచ్చరించారు.