
ఒక దివ్యాంగుడు.. శారీరక పరిమితులను అధిగమించి, పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సమాజానికి వెలుగులు పంచే పవిత్రమైన బోధనా వృత్తిలో 14 ఏళ్లకు పైగా నిబద్ధతతో సేవలు అందించాడు. 2025 జులై 31న ఉద్యోగ విరమణ పొందే నాటికి ఆయన మూల వేతనం రూ. 58,850, గ్రాస్ రూ. 89,720. కానీ, రిటైర్మెంట్ తర్వాత ఆయన చేతిలో పెట్టిన నెలవారీ పెన్షన్ ఎంతో తెలుసా? కేవలం రూ.4,013 మాత్రమే! ఇక్కడే వ్యవస్థలోని విడ్డూరం, సామాజిక అన్యాయం స్పష్టమవుతోంది. ఆయన ఒకవేళ ఏ ఉద్యోగమూ చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండి ఉంటే, ప్రభుత్వం అందించే దివ్యాంగుల చేయూత పింఛన్ నెలకు రూ. 4,016 లభించేది. అంటే, 14 ఏళ్లకుపైగా ప్రభుత్వ సర్వీస్‌లో శ్రమను ధారబోసి, ప్రతినెలా వేతనంలో పది శాతం సొమ్ము పెన్షన్ ఫండ్‌కు చెల్లించినందుకు ఆయనకు దక్కిన ప్రతిఫలం ఇది. ఏ ఉద్యోగమూ చేయని వ్యక్తికి వచ్చే చేయూత పింఛన్ కంటే సర్వీస్ పెన్షన్ తక్కువ కావడం తీవ్ర దిగ్భ్రాంతికరం. కేసముద్రం మండలం, కొత్తూరు పాఠశాల నుంచి రిటైరైన సెకండరీ గ్రేడ్ టీచర్ దొనికల వీరభద్రయ్య ఎదుర్కొంటున్న ఈ పరాభవ పరిస్థితి కేవలం ఆయన ఒక్కరిది మాత్రమే కాదు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 2.60 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల రేపటి భవిష్యత్తుకు ప్రత్యక్ష సాక్ష్యం.
విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ భిక్ష కాదు, అది వారి జీవితకాల సేవలకు దక్కే హక్కు. పెరిగే ధరలు, వయోభారంతో వచ్చే వైద్య ఖర్చుల నడుమ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్‌తో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? గత శాసనసభ ఎన్నికల ప్రచార హోరులో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) రద్దు ఒకటి. మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరచడమే కాకుండా, ఎన్నికల బహిరంగ సభలు -సమావేశాల్లో అప్పటి నాయకులు, నేటి పాలకులు ఇచ్చిన హామీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో విశ్వాసాన్ని కలిగించింది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా, ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలను కలిసిన ప్రతీ సందర్భంలోనూ సిపిఎస్ రద్దుకు కట్టుబడి ఉన్నామని అందరూ అభయమిస్తున్నారు. అందరి భావనా ఒక్కటే అయినప్పుడు, మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఉన్నప్పుడు.. మరి ఈ అంశం అమల్లోకి రావడానికి అభ్యంతరం ఏమిటి?
సమర్థవంతమైన పాలన అందించడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనది. తమ జీవితాంతం ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులకు రిటైరైన తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడే సిపిఎస్ విధానం విశ్రాంత ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. రిటైరయ్యాక వచ్చే పెన్షన్ జీవనోపాధికి సరిపోక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బలం, ఆదరణ వారు ఇచ్చిన హామీల అమలుపైనే ఆధారపడి ఉంటాయి. గతం కంటే మెరుగైన భవిష్యత్తును ఆశించి ఓటేసిన లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు నేటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల వేళ రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా జాప్యం చేయకుండా, తక్షణమే కేబినెట్ భేటీలో సిపిఎస్ రద్దు అంశంపై తీర్మానం చేసి, ఉద్యోగ, ఉపాధ్యాయులందరినీ ఓల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావాలి. నాన్చుడు ధోరణి వీడి, హామీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ నైతిక విలువలను నిలబెట్టుకోవడమే కాకుండా, ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన ఆందోళనను, మనోవేదనను తొలగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు. సిపిఎస్ రద్దు అనేది చట్టపరంగా, ఆర్థికంగా ప్రభుత్వం తీసుకోగల రాజకీయ చొరవ పైనే ఆధారపడి ఉందనేది స్పష్టం. కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం, రద్దుపై స్పష్టమైన తీర్మానం చేయడం, ఓల్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు తగిన కార్యాచరణను రూపొందించడమనేది కేవలం సిఎం రేవంత్‌రెడ్డి దార్శనికత, సంకల్పంతోనే సాధ్యమవుతుంది. దేశంలో రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఒపిఎస్ అమల్లోకి తెచ్చిన విషయాన్ని పరిశీలిస్తే సిపిఎస్ రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులేవీ లేవని స్పష్టమవుతుంది.
సిపిఎస్ అమలుతో తమ భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారిందని, రిటైరయ్యాక జీవితానికి ఏమాత్రం రక్షణ లేదని రాష్ట్రంలోని 2.60 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆవేదన నెలకొని ఉంది. మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానం వల్ల ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక భద్రత కొరవడుతోందని, కేవలం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తేనే తమకు నిజమైన భద్రత చేకూరుతుందని వారు భావిస్తున్నారు. కీలకమైన ఈ సిపిఎస్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు, 2023 శాసనసభ ఎన్నికల ప్రచారంలో నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గత రెండుళ్లుగా ఉమ్మడిగా, విడివిడిగానూ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా సిఎం చొరవ చూపాలి. సిపిఎస్ విధానాన్ని సత్వరం రద్దు చేసి ఒసిఎస్ అమలు చేయాలి.
మానేటి ప్రతాపరెడ్డి
98484 81028








