
అమరావతి: మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో సిఎం పర్యటించారు. గన్నెలలో ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని, సంజీవని పథకం రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్ లా మారుతుందని, అందరికీ ఆరోగ్యమని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతానికి వస్తే కొత్త శక్తి ఉత్సాహం వస్తుందని, ఏజెన్సీ ఏరియాల్లో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏజెన్సీలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేయిస్తామని అన్నారు.
ఆ రోజుల్లోనే గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనులకు నీళ్లు ఇస్తాం.. సోలార్ వెలుగులు తీసుకొస్తామని, ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యానికి ఏజెన్సీ మారు పేరుగా మారిందని, ప్రకృతి సేద్యాన్ని కాపాడుకుంటే మార్కెట్ లో తిరుగుండదని చంద్రబాబు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతోందని, విద్యకు ప్రాధాన్యం ఇస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని, జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్ లో సమస్యలు తప్పవని సూచించారు. ఏజెన్సీలో జనాభా తగ్గుతోందని, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అదే అసలైన సంపదని చంద్రబాబు స్పష్టం చేశారు.











