
స్నేహితునికి సహాయం చేసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు రహదారిలో ముష్టికుంట సమీపంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఆంద్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొలికపోగు లక్ష్మణ్ (28) బైక్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు చేకూరి తిరుపతి రావు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ లోని పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు. తిరుపతి రావు డ్యూటి అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ఆటోలు, బస్సులు లేకపోవడంతో లక్ష్మణ్ కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మణ్ తిరుపతి రావు ని తీసుకొని రావడానికి
మరో స్నేహితుడు రాయల సైదులును ఎక్కించుకొని నాగులవంచకు వచ్చారు. ముగ్గురూ బైక్ పై వెళ్తుండగా ముష్టికుంట్ల బోనకల్లు మధ్య రోడ్డు మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి గాయపడ్డవారిని 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు లక్ష్మణ్ మృతిచెందినట్లు తెలిపారు. తిరుపతి రావు కోమాలో ఉండగా, సైదులు కళ్లు తెలిచినట్లు సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు లక్ష్మణ్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.










