అహ్మదాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) షాకిచ్చింది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(మే 12) జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత కమిన్స్ కు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ సమయంలో స్లో ఓవర్-రేట్‌ను కొనసాగించినట్లు తేలడంతో, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కమిన్స్ కు12 లక్షల రూపాయల జరిమానా విధించింది.

కాగా, ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై హైదరాబాద్ 82 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో విరుచుకుపడిన గుజరాత్ పేసర్ల ముందు సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. కేవలం 169 పరుగుల లక్ష్య ఛేదనలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్.. టాప్ ఆర్డర్ అవుటైన తర్వాత పేకముక్కల్లా వికెట్లు కోల్పోయింది. ఒత్తిడిని తట్టుకోవడంలో మిడిల్ ఆర్డర్ విఫల్ కావడంతో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడా, జాసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.