
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత పార్టీ ఎంఎల్‌ఎలే బహిరంగంగా వెల్లడిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో పాలన ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాహుల్‌గాంధీ, ఎఐసిసికి ఎటిఎంగా మార్చుకున్నారని కెటిఆర్ ఆరోపించారు. దేశ ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఎఐసిసికి ఎటిఎంగా మారిందని చెబుతున్నారని, మరోవైపు అధికార పార్టీ ఎంఎల్‌ఎలే రాష్ట్రంలో అవినీతిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అన్నారు. తెలంగాణను ఎఐసిసికి ఎటిఎంగా మార్చారన్న ఆరోపణలు ప్రధానమంత్రి స్థాయి నుంచి వస్తున్నప్పుడు,
కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు. ఈడీ దాడులు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, విచారణ ఎక్కడికి చేరిందో ప్రజలకు స్పష్టత లేదని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నది తెలంగాణ రాష్ట్రం కోసం కాదు అని, ఆయన కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బావమరుదులు, అల్లుడికి భూములు, కాంట్రాక్టులు, నిధులు దోచిపెట్టేందుకే అని కెటిఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవడం కాకుండా, ముఖ్యమంత్రి తన పాలనలో ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మిరద్దుకు కాంగ్రెస్ కుట్ర
కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని కెటిఆర్ అన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కల్యాణలక్ష్మి అంశంలో హైకోర్టు తీర్పు వెలువడిందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసి న ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. కెసిఆర్ కిట్‌ను రద్దు చేశారు, కల్యాణలక్ష్మిని నిర్వీర్యం చేస్తున్నా రు, రైతు బీమాను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నల్సార్ విద్యార్థులకు సెల్యూట్
ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై దాడి జరిగితే యువత సహజంగానే తిరగబడుతుందని కెటిఆర్ అన్నారు. తమ హక్కులు, గౌరవం కోసం ధైర్యంగా నిలబడిన నల్సార్ విద్యార్థులకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. విద్యార్థులు, న్యాయవ్యవస్థ మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధాన్ని గుర్తించిన భారత ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలి
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు వ్యక్తిగత, ప్రాంతీయ, భాషా, మత, కుల, రాష్ట్రపరమైన గుర్తింపులు ఎన్నున్నప్పటికీ అన్నింటికంటే ముందుగా మనమంతా భారతీయులమని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే రెండేళ్లు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.











