
సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్(17) అనే విద్యార్థి గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులతో తరుణ్ జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్నాడు.అయితే ఓ మహిళా లెక్చరర్ కాలేజీలో 435 మార్కులు వచ్చిన విద్యార్థితో తరుణ్‌ను పోల్చుతూ కించపరిచింది. అలా అవమానపరచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను తరుణ్ విజ్ఞప్తి చేశాడు. ఈక్రమంలో కోపోద్రిక్తురాలైన లెక్చరర్ నువ్వేమైనా మంత్రి కొడుకువా అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై కొట్టి అవమానించింది. లెక్చరర్ ప్రవర్తనకు క్లాస్ తోటి విద్యార్థులు నవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన తరుణ్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.











