
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన ఛాంబర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కలిసి పరామర్శించారు. సోమవారం అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు కలిశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు స్పీకర్‌ను వ్యక్తిగతంగా దూషించటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సోమవారం కంట తడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.
మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టిలు స్పీకర్‌ను పరామర్శించి, ఓదార్చారు. సోమవారం జరిగిన సంఘటనలపై వారిద్దరూ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్‌కు వారు హామినిచ్చారు.













