
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. న్యూజెర్సీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 10 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించి ప్రపంచకప్ టైటిల్‌ను దక్కించుకుంది. స్పెయిన్‌కు ఇది రెండో వరల్డ్‌కప్ ట్రోఫీ కావడం విశేషం. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది. తాజాగా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగిన తుది పోరు చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ఇటు స్పెయిన్ అటు అర్జెంటీనా గోల్ కోసం సర్వం ఒడ్డి పోరాడాయి. కానీ తొలి హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో కూడా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేక పోయింది. దీంతో ఆట ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుత గోల్ సాధించాడు. దీంతో స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది.
కల చెదిరిన అర్జెంటీనా..
ఈ వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా అంచనాలకు తగినట్టు రాణిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన నాకౌట్ మ్యాచుల్లోనూ అసాధారణ ఆటను కనబరిచింది. రౌండ్ 32లో పసికూన కేప్ వెర్డేను ఓడించింది. తర్వాత ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో మాత్రం స్పెయిన్ ముందు తలవంచక తప్పలేదు. తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సి అర్జెంటీనాకు ట్రోఫీ అందించాలని భావించాడు. కానీ స్పెయిన్ అద్భుత ఆటతో మెస్సి ఆశలపై నీళ్లు చల్లింది. ఏకైక గోల్ తేడాతో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో నాలుగో ప్రపంచకప్ ట్రోఫీని సాధించాలనే అర్జెంటీనా కల చెదిరి పోయింది.











