హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. పనులు మాత్రం గడప కూడా దాటడం లదేని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బిఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకు యూరియా అందించలేకపోతున్నారు. కెసిఆర్ హయాంలో రైతులకు అన్నీ ఇళ్ల వద్దకే వచ్చేవి. రూ.2లక్షల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. 30-40 శాతమైనా పూర్తి చేశారా? ఒక్క ఊరిలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలని సిఎం రేవంత్‌కు అసెంబ్లీలోనే వాల్ విసిరా. కెసిఆర్ హయాంలో 11సార్లు రైతుబంధు వేశారు. కాళేశ్వరంపై మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రజలకు తెలిసిపోతుందనే రేవంత్ నీళ్లు వదలడం లేదు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు ఎందుకు చేయడం లేదు. ఎన్‌నినో వస్తుందని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు చెబితే.. ప్రభుత్వం ఇప్పుడు సమీక్షలు చేస్తోంది. సరైన ప్రణాళిక లేకుండా సిఎం పని చేస్తున్నారు’’ అని కెటిఆర్ విమర్శించారు.