
హైదరాబాద్: ఓటు ప్రక్షాళన ముఖ్యమని పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం ఎస్ఐఆర్ పూర్తి..మరో 30 శాతం చేయాలని ఆదేశించానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్నచిన్న తేడాలు ఉన్నా ఓటరు సవరణ సరికాదని, తనకు రెండు ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వమనండి అని అన్నారు. తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని హెచ్చరించారు. తన ఓటు బదిలీ చేయించుకున్నానని, కలెక్టర్ కు దరఖాస్తు చేసే బదిలీ చేయించుకున్నానని తెలియజేశారు. గతంలో కర్ణాటకలో కొడంగల్ ఉందని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినపుడు తెలంగాణలోకి వచ్చిందని అన్నారు. బిఎల్ వొలకు అనుసంధానంగా పార్టీ వాళ్లు ఓట్లు పోకుండా చూస్తున్నారని, ఎస్ఐఆర్ పై అవగాహనారాహిత్యం వల్లే బిఎల్ ఎలను పెట్టామని అన్నారు. బిఎల్ఎలు పరిశీలన చేసి ఓట్లు పోకుండా చేస్తారని, ఓట్లు లేకుండా ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు? ప్రక్షాళన పేరుతో ఓట్లను తొలగించే అవకాశం ఉందని, గతంలో జిహెచ్ ఎంసి పరిధిలో ఆంధ్ర ఓట్లన్ని తొలగించారని అన్నారు. కాంగ్రెస్ కోర్టుకెళితే నాటి జిహెచ్ఎంసి కమీషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బిజెపి లో అంతర్గత కలహాలు ఉన్నాయని బిజెపి నాయకులకు ఒకరంటే ఒకరికి పడదు అని అన్నారు. ఎస్సి, ఎస్టి, మైనారిటీ ఓట్లు ఎక్కడుంటాయో బిజెపికి తెలుసని, చిన్న చిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామని, తాము ఏం చేస్తున్నామో అదే చెబుతున్నామని తెలియజేశారు. ఇళ్లను బ్రోకర్లకు అమ్ముకుని బిఆర్ఎస్ దళారీ వ్యవస్థ తెచ్చిందని మండిపడ్డారు. కుట్ర పూరితంగా సర్ ను వాడుతున్నారని, ఎస్సి, ఎస్టి, మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టేనని అన్నారు. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో.. స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశముందని సూచించారు. ఓటు హక్కు లేకపోతే గుర్తింపే ఉండదు కదా! అని ఓటు హక్కు లేకపోతే పథకాలు పోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.











