
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్స్ రివిజన్(సర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను ఏరివేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఈ తొలగింపుల ప్రక్రియ భవిష్యత్తు ఎన్నికల్లో తమ గెలుపోటములను ఎలా ప్రభావితం చే స్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లు ఉండగా, అందులో ఇప్పటివరకు సుమారు 80శాతం మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. కాగా,
మొత్తం ఓటర్లలో 50 లక్షల నుంచి కోటి వరకు ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను తొలగించడం, మరణించిన వారిని ఓట్లు తొలగించడంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ అర్హులైన వారి ఓట్లు తొలగిస్తారనే అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు అర్హులైన ఓట్లు తొలగిస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటరు చిరుమానా మారడం, ఒకే ఇంట్లో ఒకే కుటుంబం సభ్యుల ఓట్లు వేర్వేరు బూత్‌లు ఉండటంతో ఇప్పటివరకు వరకు బిఎల్‌ఒలు తమకు ఫారాలు ఇవ్వకపోవడంతో తమ ఓటు ఉందా.. పోయిందా..? అనే ఫారాలు అందని ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరాల్లోనే భారీగా కోత
తాజా గణాంకాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి వంటి అర్బన్ జిల్లాల్లోనే సేకరించలేని ఫారాలు, చిరునామా మారిన ఓటర్లు అత్యధికంగా నమోదయ్యాయి. ఉపాధి, ఉద్యోగ రీత్యా స్వగ్రామాలకు లేదా వేరే ప్రాంతాలకు మారిన వారి సంఖ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షల్లో ఉంది. అయితే గ్రామాల్లోనూ, నగరాల్లోనూ రెండేసి చోట్ల ఓటు హక్కు కలిగిన ఉన్న వారు తమ సొంతూళ్లలోనే ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తున్నారు. దీంతో నగరాలలో ఓట్లు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ సమీకరణలపై ప్రభావం
ఓటర్ల జాబితా ప్రక్షాళన సాధారణ ప్రక్రియే అయినా, కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని వేల ఓట్లే గెలుపోటములను నిర్దేశిస్తుంటాయి. దీంతో ఈ తొలగింపుల ప్రక్రియపై రాజకీయ పక్షాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో 2 వేల నుంచి 5 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాల్లో 10,000కు పైగా ఓట్లు తొలగింపు జాబితాలోకి వెళ్తుండటంతో ఆయా నియోజకవర్గ నేతల్లో ఆందోళణ వ్యక్తమవుతోంది. తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు లేదా సానుభూతిపరుల ఓట్లు ఏవైనా పొరపాటున తొలగింపు జాబితాలో చేరాయా.. అనే అంశంపై పార్టీల క్షేత్రస్థాయి యంత్రాంగం బూత్ స్థాయిల వారీగా జాబితాలను సరిచూస్తోంది. కాగా, క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్లును కూడా తొలగిస్తున్నారంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తుండగా, పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసమే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ సవరణలు చేస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఫారాలు సమర్పించేందుకు నేతల పరుగులు
ఓట్ల తొలగింపు వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు రాజకీయ పార్టీల నాయకులు తమ కార్యకర్తలను అప్రమత్తం చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు గడువు ముగిసేలోగా అర్హులైన ఓటర్లందరిచేత ఫారాలు నింపించి వారి సంతకాలు తీసుకుని బిఎల్‌ఒలకు అందజేసేందుకు వివిధ పార్టీల నేతలు పరుగులు పెడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించే గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 10 వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ ఇసిఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17వ తేదీన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 వరకు అభ్యంతరాను పరిశీలిస్తారు. అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత ఓటర్ల సంఖ్యలో రానున్న మార్పులు, చేర్పులు రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని ఏ మేర ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.








