
నేను నా సాహితీ యాత్ర : (14) స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలో మార్పుకై రచనలు1948 అక్టోబర్ 24న నేను జగ్గంపేట అనే గ్రామంలో పుట్టాను. అప్పటికది తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం తాలూకాలో ఉండేది. అదే ప్రాంతంలో మరికొన్ని జగ్గంపేటలు ఉండడం వల్ల - రామానుజులు ప్రతిష్ఠించిన వైష్ణవాలయం ఉన్న చిన్న గ్రామం తాళ్లూరును కలిపి తాళ్లూరి జగ్గంపేట అనేవారు. నా తల్లిదండ్రులు శ్రీమతి బంగారమ్మ, శ్రీ పల్లా వెంకటరమణ. మా ఊరి హైస్కూల్లో పదవతరగతి చదువుతూండగానే అప్పటి పద్ధతుల ప్రకారం నాకు కె. రామమోహనరావు గారితో వివాహం జరిపించారు మా పెద్దవాళ్లు. మరో ఏడాది చదువుకుని S.S.L.C (11వ తరగతి) పాసయ్యాను. మరో పదేళ్ల తర్వాత మళ్లీ ఇంటర్మీడియేట్ నుంచి ప్రారంభించి M.A. చేసాను. మావారి ఉద్యోగరీత్యా అప్పటికి మేమున్న జగ్గంపేటలోనే ఓ చిన్న ప్రైవేటు స్కూలు నడుపుతూ దాన్లోనే టీచర్ గా పనిచేసాను. మొదట్లో చాలానే కవితలు రాసినా ప్రచురణా 8వ తరగతి చదువుతు న్నప్పు డు ఆంధ్రపత్రిక వీక్లీలో వచ్చిన ‘కాఫీ కాదు’ అనే చిన్న కథ - పెద్దయ్యాక చాన్నాళ్లకి జ్యోతి మంత్లీలో వచ్చిన ‘రిక్షా’ అనే కథ నా మొదటి కథలు.
మా ఇంట్లో ఎలాంటి సాహిత్య వాతావరణం ఉండేదికాదు. బహుశా నా బాల్యంలో మా తండ్రి గారు వేసిన పౌరాణిక నాటకాల పద్యాల - సంభాషణల సొబగు నాకు ఎంతో నచ్చేది. దానితోబాటు నేను అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడే మా వీధిలోని ఆడవాళ్లు ‘తిరుపతమ్మ కథ, కామమ్మ కథ‘ లాంటి ద్విపద కావ్యాలు నన్ను చద వమని పట్టుకొచ్చేవారు. నేను కూడబలుక్కొంటూ ఆ పుస్తకాల్ని చదివేదాన్ని. వాళ్లం తా ఆ కథల్లో వచ్చే ఆనందాలకి ఆనందిస్తూ, కష్టాలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండే వారు. అప్పుడు నాకర్థమైంది పుస్తకాల్లో కథలుంటాయని. మా హెడ్మాస్టారి కుర్చీ వెనక ఉన్న చిన్న గదిలో బోలెడన్ని పుస్తకాలు చూసాను. లీజరు టైంలో పిల్లలంతా ఆడుకుంటుంటే నేను అటెండరు కుశాల్రావుని బతిమలాడి ఆ పుస్తకాల గదిలో కూర్చునేదాన్ని. బాలల బొమ్మల రామాయణం లాంటి ఎన్నో పుస్తకాలు మూడవ తరగతిలోకి వచ్చేసరికే పూర్తయ్యాయి.
మా వీధిలో ఉన్న గ్రామ గ్రంథాలయంలో చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాల కథ లు మా అమ్మకు చదివి విన్పించేదాన్ని. ఇక మూడవ తరగతి లో మానాన్న నాకో ఇంకు పెన్ను కొనిస్తే ఆ సంబరం పట్టలేక హెడ్మాస్టారి టేబుల్ మీదున్న పెద్ద రిజిస్టర్ బుక్‌లో అన్ని పేజీల్లో పైన నా పేరు రాసేసా ను, మా నాన్నతో ఉన్న స్నేహం వల్ల నన్నేమీ అనలేక ఆయన మా నాన్నకి కంప్లైంట్ చేసారు. దానికి మా నాన్న నాకిచ్చిన పనిష్మెంట్ ఏమిటంటే నన్ను అప్పటికి మా ఊళ్లో ఉన్న ఒకే ఒక టాకీస్ లో ఆడుతున్న ‘రేణుకాదేవి మహత్యం’ సినిమాకి తీసుకెళ్లి మర్నాడు కొన్ని తెల్లకాయితాలిచ్చి ఆ కథను వ్రాయమన్నారు. ఇలాంటి సంఘటనలతో బాటు నిరంతరం ఆపకుండా చదివిన కథలు, కవిత్వం, నవలలు నాకు సాహిత్యం పట్ల గొప్ప అభిరుచి కలగడానికి కారణాలయ్యాయి.
తెలుగు సాహిత్య ప్రక్రియలలో చదవడానికి అన్నీ ఇష్టమే అయినా వ్రాయడానికి మాత్రం కథ అంటేనే ఇష్టం. కథకు మొదట చదివించే గుణం ముఖ్యం. చెప్పదలచుకున్న విషయాలు పొట్లంలోని పూలలాగ గుబాళించాలి. తెలుగులో చాలా మంచి కథలు, ఎన్నదగిన కథలు కథ ప్రారంభమైనప్పటి నుంచీ వచ్చాయి. ఇప్పుడూ వస్తున్నాయి. అందుకే కథంటే నాకు గొప్ప గౌరవం. సాధారణంగా నేను ఒక కథ రాయాలి అనుకుని వస్తు సేకరణకు దిగను, వస్తువే నాకంటపడి రాయమని డిమాండ్ చేస్తుంది. మనసును కదిలించే - పట్టి కుదిపేసే వస్తువు కంటపడినప్పుడు రాయకుండా ఉండలేను. స్త్రీల జీవితాలు సమస్యల మయాలు. ముఖ్యంగా పల్లెలలోని స్త్రీలను పరిశీలించి, పట్టించుకుని ఆ సమస్యల మూలాల్ని చెప్పాలని, తద్వారా పురుషులకి, తోటి స్త్రీలకి వారి మీద ఉన్న చులకన భావాన్ని పోగొట్టాలని నేను రాయడం మొదలుపెట్టేను. క్రమంగా స్త్రీలనే కాదు, బడుగు జీవులందర్నీ పట్టించుకొని రాసేను. కథలు చదివిన వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని బట్టి నేను సక్సెస్ అయ్యానని తెలిసింది.
నేటి కథా రచయితలు కొందరు రచనను సీరియస్ గా పట్టించుకుని మంచి కథలు రాస్తున్నారు. ఇంకొందరు దానికి వ్యతిరేకంగా రాస్తున్నారు. అది వారి వారి అభిరుచిని బట్టి ఉంటోంది. మొత్తం మీద కొత్త సబ్జక్ట్ తో మంచి కథలు వస్తున్నాయి. స్త్రీల సమస్యలపై రచయిత్రులే రాయగలరని నా అభిప్రాయం. పురుషులు కూడా రాస్తున్నా స్త్రీల గురించి పరిపూర్ణమైన అవగాహన స్త్రీలకే ఉంటుంది. సరదా కథలు, జీవితంలో అంతా ఓకె అని రాసిన, రాస్తున్న రచయిత్రులే ఎక్కువమంది ఉన్నా, జీవితాల్ని అర్థం చేసుకుని రాసిన, రాస్తున్న రచయిత్రులకే పాఠకులు ఎక్కువమంది ఉంటారు. అటువంటి రచనల వల్ల పాఠకుల అవగాహనా శక్తి మెరుగుపడుతుంది. తెలుగు లో అటువంటి గొప్ప రచయిత్రులు చాలామంది ఉన్నారు.
నాకెప్పుడూ వస్తువు పరంగా, భాషాపరంగా అవరోధాలు ఎదురుకాలే దు. ఎందుకంటే నాకు తెలీని విషయాల గురించి నేనెప్పుడూ రాయడా నికి ప్రయత్నించలేదు. నా కథల్లోని పాత్రలన్నీ నాకు తెలిసినవే కావడం వల్ల అప్పటికే వస్తువు పూర్తిగా రూపుదిద్దుకుంటుంది. ఇక భాష విష యానికి వస్తే చిన్నప్పటి నుంచీ నేను చదివిన సాహిత్యం, నేను చేసిన తెలుగు M.A. నాకెప్పుడూ సహాయ పడతాయి. మాండలికం పరంగా మా తూర్పుగోదావరి మాండలికం, భాష పరంగా గోదావరి జిల్లాల భాష నా కథా రచనకు ప్లస్. అలా అని తెలంగాణా, రాయలసీమ మాండలికాల్లో రాయలేను. పల్లెలలోని స్త్రీల జీవిత సమస్యలు ప్రధానంగా నా చాలా కథలకు ముఖ్య భూమిక వహిస్తాయి. క్రమంగా బడుగు వర్గాల పురుషుల సమస్యలు, వారి నడవడిక ప్రధానంగా కూడా కొన్ని కథలు రాసాను.
స్త్రీల పట్ల పురుషుల దృక్పథంలో మార్పు రావాలని నా ముఖ్యమైన ఉద్దేశం. అలాగే వెనకబడిన వర్గాల, బడుగు వర్గాల స్త్రీల పట్ల పై వర్గాల స్త్రీలకు ఒక చులకన భావం ఉంటుంది. దాన్ని కూడా మార్చాలని నేను కథలు రాసాను. నేను రాయడం మొదలు పెట్టినప్పటికీ, ఇప్పటికీ సమాజంలో మార్పు వచ్చింది కొంత పురుషుల విషయంలో పై వర్గాల స్త్రీల భావాలు మాత్రం నివురుకప్పిన నిప్పులా అలాగే ఉన్నాయి. ఇంకొక విషయం, జనంలో మూఢ నమ్మకాలు, కులమత వివక్షలు పైన అవగాహన పెంపొందించాలని కూడా కోరుకున్నాను. చెప్పడం ఒకటే చాలదని, అనుసరించి కూడా చూపించా లని మా అబ్బాయి, అమ్మాయిలకి వాళ్లు కోరుకున్న వాళ్లతో కులాంతర వివాహాలు జరిపించాను. కథ మొత్తం మాండలికంలో రాస్తే చదివే వాళ్లకి ఇబ్బంది అవుతుంది. ఎవరికీ పరిచయంలేని మారుమూల మాండలికాలు చదివి అర్థం చేసు కోవడం కష్టం. దానికోసం ఫుట్ నోట్స్ కూడా పెట్టవలసి వస్తుంది. నేను కూడా పాత్రల సంభాషణల కోసం ఔచిత్యాన్ని బట్టి మాండలికాన్ని రాసా ను. కాని, మా తూర్పు గోదావరి జిల్లా మాండలికం ఏ ప్రాంతం వారికైనా తేలికగా అర్థమౌతుంది.
నేను కొత్తగా చెప్పే సలహాలు - సూచనలు ఏమీ లేవు. మా ముందు తరంవాళ్లు చెప్పినవే. రచయితలు కావాలనుకునే వాళ్లు బాగా అధ్యయనం చెయ్యాలి. గుర్తింపు పొందిన ప్రముఖ రచయితల రచనల్ని చదవాలి. ఇప్పుడు కొత్త గా రాస్తున్న చాలా మంది టైం లేకో ఏమో అలా చెయ్యడం లేదట. కథ రాసినప్పటినుంచీ ప్రచురణకు పంపించాలని ఒకటే తొందర. పత్రిక లో రాకపోతే ఫేస్ బుక్ లో పెట్టెయ్య డం, కొందరు అవగాహనతో రాస్తున్న రచయితలకు ఎవరి సలహాలూ అక్కరలేదు. చదువొక్కటే నా జీవితాన్ని ప్రభావితం చేసిన అంశం. చదువు మీద నాకున్న ఇష్టం, ప్రేమ నా బాల్యం నుం చీ ఇప్పటివరకూ నన్ను వదలలేదు. నాలో గొప్ప పట్టుదలను పెంచింది. లేకపోతే మా యాదవ కులంలో, మా ప్రాంతంలో అప్పటి అమ్మాయిలందరి లాగే మహా అయితే ఐదవ తరగతి వరకూ నా చదువు కొనసా గేది. కన్పించిన ప్రతీ కాయితాన్ని, పత్రికను చదివే అలవాటు వల్ల నాల్గవ తరగతిలో స్వాతంత్య్రోద్యమం గురించి వ్యాసాన్ని, నెహ్రూజీ గురించి ఉపన్యాసాన్ని ఇచ్చి బహుమతులు పొందేను.
ఆ సందర్భం గా మా ఊరి హైస్కూలు స్టేజి మీద D.E.O గారి పక్కన కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేసారు. ఆ సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. మొదటి కవితా పురస్కారం, కథా పురస్కారం, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, దొరికిన చిన్ని చిన్ని సంతో షాలు అన్నీ నన్ను ప్రభావితం చేసి నా చేత కథలు రాయించాయి. నా కథా వస్తువులు కొన్ని నా జీవితానుభవాలు - కొన్ని నా చుట్టూ ఉన్న, నాకు తెలిసిన వారి అనుభవాలు, కల్పితాలు ఏవీ లేవు. కాని తెలిసిన, చూసిన వాటిని యాజిటీజ్ గా రాసేస్తే వ్యాసమై కూర్చుంటుంది. కథ కూడా శిల్పం లాంటిదే. దాన్ని ఎక్కడా అందం చెడకుండా చెక్కాలి. కథకు గుర్తింపు రావాలంటే కొంత ప్రత్యేకత ఉండాలనుకుంటాను, కథా వస్తువు ఎంపికలో రచనా విధానంలో, పాఠకులు చదువుతూ ఈ కథను ఇదివరకు ఎక్కడో చదివేసాను అనుకోకూడదనుకుంటాను.
నా కథల నేపథ్యాలు కొన్ని చెప్పాలి. ఉదాహరణకి : ‘గాజుపళ్లెం’ కథ నాకు తెలిసిన ఒక దళిత అమ్మాయిది. ‘ఖాళీ సంచులు’ కథ చిన్నప్పుడు నా దగ్గర పెరిగిన బి.సి. కులం అమ్మాయిది. ఆ అమ్మాయి అడగడం వలన కథలో తన పేరు కూడా మార్చలేదు.‘మంత్రసాని’ కథ నేను పుట్టినప్పుడు మా అమ్మకు పురుడు పోసిన ఎరకల రాయడం మొదలుపెట్టిన 1984-85 నాటి చిన్న కథల నుంచీ అన్నీ నాకు సంతృప్తిని కలిగించినవే. న చ్చకుండా ఎప్పుడూ పత్రికలకు పంపలేదు. సాధారణంగా రచయితలెవరూ “మీ కథల్లో మీకు నచ్చిన కథ ఏది?” అంటే చెప్పలేరు. పిల్లల్లో అంటే కన్నబిడ్డల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే తల్లి ఏమని సమాధానం చెప్పగలదు? కాని, ఒకోసారి రచయితకు నచ్చిన కథ పాఠకులకు గొప్పగా అనిపించ కపోవచ్చు.అలాగే పాత్రలు కూడా అంతే. కాని, చెప్పక తప్పదు అంటే పైన చెప్పిన ముగ్గురితోబాటు ‘మట్టి-బంగారం’ లో ‘మూలమ్మమామ్మ’, ‘మధుర’ కథలో ‘మధుర’, ‘నిరసన’లో‘అన్నారం’, ‘అతడు -నేను’ లో ‘నేను’ - ఇలా చెప్పుకొంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది అయిపోతుంది.
నా పుస్తకాలన్నిటిమీద M.Phil పరిశోధనలు, సమగ్ర కథా సాహిత్యం పైన డాక్టరేట్ చేశారు. మొదటి కథల పుస్తకం జీవరాగం 1996,రెండవ కథల సంపుటి మట్టి బంగారం 2002లో (తెలుగు యూనివర్సిటీ), మూడవ కథల సంపుటి అతడు - నేను 2007లో (యన్.కే. పబ్లిషర్స్),నాలుగవ కథల సంపుటి క్షతగాత్ర 2014లో (విశాలాంధ్ర ప్రచురణ) ఐదవ కథా సంపుటి పిట్ట గూళ్లు 2018లో (ఈ బుక్),కవితా సంపుటి ఆమె 2003లో (సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్),1983 నుంచి 85 వరకూ జ్యోతి మంత్లీలో 1. ఉషోదయం, 2. కిడ్నాప్, 3. ప్రశాంతి, 4. పుట్టింటికి నవలికలు, పైకథా సంపుటాల నుంచి ఎంపిక చేసిన కథలతో అరసం వేసిన పుస్తకం పది కథల కథా స్రవంతి 2019 జనవరిలో, నా ఆత్మకథ తొలిజాడలు పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించారు. చాలా కథలు, కవితలు వివిధ సంకలనాలలో వచ్చాయి. నా రచనలకు వచ్చిన చాలా పుర స్కారాల్లో -2002 లో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి, 2004 లో చాసో స్ఫూర్తి,2008 లో విమలాశాంతి,2014 లో సుశీలా నారాయణరెడ్డి,2015 లో పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి,2020 లో అజో -విభో - కందాళం - విశిష్ట సాహితీమూర్తి,2025 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం,తానా, ఆటా, వంగూరి ఫౌండేషన్ మొదలైనవి కొన్ని.

కె. వరలక్ష్మి














