న్యూఢిల్లీ ః సుప్రీంకోర్టు కొలీజియంలో న్యాయమూర్తి పిఎస్ నరసింహ సభ్యులు కానున్నారు. ఆదివారం జస్టిస్ జెకె మహేశ్వరి రిటైర్మెంట్‌తో కొలీజియంలో సభ్యులుగా సుప్రీంకోర్టులో ఐదవ సీనియర్ న్యాయమూర్తి నరసింహకు అవకాశం దక్కింది. ఈ బాధ్యతల్లో ఆయన 2028 మే 2వ తేదీ వరకూ ఉంటారని సుప్రీంకోర్టు అధికారిక కార్యాలయ వర్గాలు ఆదివారం తమ ప్రకటనలో తెలిపాయి.

ఇప్పటి మార్పుల తరువాత కొలీజియంలో ఇకపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుంద్రేష్‌తో పాటు జస్టిస్ పిఎస్ నరసింహ కూడా తాజాగా చేరుతారు. కొలీజియంలో సభ్యుడు అయ్యే న్యాయమూర్తి నరసింహ 1963 మే మూడున హైదరాబాద్‌లో జన్మించారు. విద్యాభ్యాసం ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగింది, నిజాం కాలేజీ విద్యార్థి అయిన నరసింహ ఢిల్లీ యూనివర్శిటీలో 1988లో క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.