
న్యూఢిల్లీ: సీజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఆర్డినెస్స్ స్థానే ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ సోమవారంనాడు ఆమోదం తెలిపింది. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చర్చ లేకుండానే బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఆర్డినెన్స్ జారీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సైతం మూజువాణి ఓటుతో సభ తోసిపుచ్చింది. గత వారం కూడా సభలో ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి చర్చ లేకుండానే జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సంక్షిప్తంగా సభకు వివరించారు. అనంతరం దీనిపై చర్చించాల్సిందిగా సభ్యులను సభాపతి ఓం బిర్లా కోరారు. అయితే విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో బిల్లును సభాపతి ఓటింగ్‌కు పెట్టారు. దీంతో మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సంఖ్యను పెంచేందుకు గత మేలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం దీనిపై ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. పెంచిన సంఖ్యకు అనుగుణంగా సుప్రీంకోర్టుకు ఐదుగురు జడ్జీలను నియమించింది. సహజంగా ప్రభుత్వ ఆర్డినెన్స్ గడువు ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఆరు వారాలు లేదా 42 రోజుల్లోగా ఆర్డినెన్స్‌ను చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది.











