
గాలె: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని దక్కించుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు లంకపై విజయం పెద్ద ఊరటగా చెప్పాలి. ఈ గెలుపుతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఓవర్‌నైట్ 84/4 స్కోరుతో బుధవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ చేపట్టిన లంక ఆరంభంలో బాగానే ఆడింది.
కెప్టెన్ ధనంజయ డిసిల్వా, సోనల్ దినుష భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు కెప్టెన్ శుభ్‌మన్ తరచూ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఇటు ధనంజయ అటు సోనల్ అసాధారణ పోరాట పటమితో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ 151 బంతుల్లో ఏడు ఫోర్లతో 59 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 95 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్ల 10 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ చేతికి చిక్కాడు. అయితే సోనల్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి నువాంత అండగా నిలిచాడు.
తిప్పేసిన సుతార్
భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సోనల్, నువాంత స్కోరును ముందుకు నడిపించారు. ఈ దశలో మానవ్ సుతార్ 76వ ఓవర్‌లో మూడు వికెట్లు తీసి భారత్‌కు విజయం ఖాయం చేశాడు. తొలుత కుదురుగా ఆడుతున్న సోనల్‌ను సుతార్ ఔట్ చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సోనల్ 128 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 84 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్యను సుతార్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇదే ఓవర్ బంతికి లహిరు కుమార (0)ను కూడా సుతార్ వెనక్కి పంపాడు.
అంతేగాక 78వ ఓవర్‌లో కేశర నువాంతను కూడా సుతార్ ఔట్ చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన నువాంత 69 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో లంక ఇన్నింగ్స్ 77.4 ఓవర్లలో 206 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి.








