
అది ప్రత్యేకతలేమీ లేని ఒక సాధారణ వీధి. హైదరాబాద్ వైఎంసిఎ నుంచి బర్కత్‌పురా సర్కిల్ వరకు కేవలం అరకిలోమీటరు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని నెలల క్రితం ఆ వీధిలో కారులో ప్రయాణిస్తుండగా, నా మనసులోని జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా కదిలాయి. క్యాన్సర్‌తో పోరాడుతున్న నా చిన్ననాటి స్నేహితుడిని కలవడానికివెళ్తున్నాను. ఎంతో మారిపోయిన మహానగరమైన హైదరాబాద్‌లో, ఆ వీధి మాత్రం పెద్దగా మారలేదనే భావన కలిగింది. ఎందుకంటే నేను వయసులో ఉన్నప్పుడు ఎన్నో సాయంత్రాలు అతనితో అక్కడే గడిచాయి. కవి వర్డ్స్‌వర్త్ మాటలను గుర్తు చేసుకుంటూ చెప్పాలంటే.. ఆ సంధ్యవేళలను అనుభూతి చెందడం ఒక ఆనందమైతే, వయసులో ఉండటం నిజంగా స్వర్గానుభూతిలా అనిపించేది. ఆ వీధిలో ప్రతి సాయంత్రం వాకింగ్ ఎన్నో సంభాషణలకు వేదికగా ఉండేది. పక్కింటి అమ్మాయిల నుంచి వియత్నాం యుద్ధం వరకు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల నుంచి మహమ్మద్ రఫీ పాటల వరకు మా చర్చలకు హద్దులు ఉండేవి కాదు. యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై వంటి పాటలు మా యవ్వనపు భావోద్వేగాలకు ప్రతిధ్వనిలా అనిపించేవి.
ఆ రోజులలో ఉమాకాంత్, ప్రదీప్, అప్పుడప్పుడు సీతారాం కూడా మా వెంట ఉండేవారు. ఆ సీతారామే తరువాత కాలంలో ఏచూరిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. కానీ మా అందరి సంభాషణలపై తన ప్రభావం చూపిన గొంతుమాత్రం కొమండూర్ సంతాన గోపాల్‌దే. కొంతమంది ఆయనను కెఎస్ అని, మరికొందరు గోపాల్ అని పిలిచేవారు. కానీ ఆ కాలంలో ఆ నగరంలో ప్రాధాన్యం కలిగిన వ్యక్తి గోపాల్ ఒక్కరే. మే 16న, 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. మేము వేర్వేరు పాఠశాలల్లో, తరువాత వేర్వేరు కళాశాలల్లో చదివినా, 1960ల చివరలో, 1970ల ప్రారంభంలో చర్చా వేదికల ద్వారా ఒకటయ్యాం. వాదోపవాదాలపట్ల అపారమైన ఆసక్తితో డిబేటింగ్ క్లబ్‌లో సభ్యులమయ్యాం. మేము నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లు, మాక్ అసెంబ్లీలు ఆ రోజుల్లో ఎంతో ఆదరణ పొందేవి. అందులో గోపాల్ ప్రతిపక్ష నాయకుడి పాత్రలో అద్భుతంగా రాణించేవారు. ముఖ్యమంత్రి పాత్రలో మాత్రం ఆయనకు అసౌకర్యంగా అనిపించేది. అదే ఆయన వ్యక్తిత్వానికి నిజమైన ప్రతిబింబం అధికారంలో కూర్చోవడం కంటే, అధికారాన్ని ప్రశ్నించడం ఆయన సహజ స్వభావం.
ప్రతి సాయంత్రం మేమంతా నారాయణగూడలోని ఒక ఇరానీ కేఫ్‌లో కలుసుకునేవాళ్లం. అప్పుడప్పుడు కమ్యూనిస్టు భావజాల ప్రముఖుడు మోహిత్ సేన్ నివసించే సాధారణ అపార్ట్‌మెంట్‌కి కూడా నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. అక్కడే నేను తొలిసారి విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జ్‌రెడ్డిని కలిశాను. తరువాత హత్యకు గురైన జార్జ్‌రెడ్డి, గద్దర్‌లాగే మా తరానికి గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. ఆ చిన్న ఫ్లాట్‌లో నేలపై కూర్చొని కామ్రేడ్ మోహిత్ సేన్ నుంచి ఆలోచనలు, విజ్ఞానం గ్రహించడం మాకు ఎంత సహజంగా అనిపించేదో, అదే విధంగా ఆయన సోదరుడు ఎన్.పి. పొట్లా సేన్ ఇంట్లో జరిగే సమావేశాల్లో పాల్గొనడం కూడా అంతే సహజంగా ఉండేది. మాజీ నవాబ్ రాజభవనాల్లో ఒకటి తరువాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) క్యాంపస్‌గా మారింది. అక్కడే ఎన్.పి. సేన్ నివసించేవారు. ఒకప్పుడు ఎయిర్ ఇండియా చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రముఖులకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ యువ విద్యార్థులను కూడా ఆ సాయంత్రపు మేధో సమావేశాలకు ఆహ్వానించేవారు. అలా మేము ‘ది మంత్లీ రివ్యూ’ సంపాదకుడు హ్యారీ మాగ్డాఫ్‌ను కలిసే అవకాశమూ పొందాం. కేంబ్రిడ్జ్‌లో మన్మోహన్ సింగ్‌కు బోధించిన ప్రముఖ ఆర్థికవేత్త జోన్ రాబిన్సన్‌తో కూడా సంభాషించే అదృష్టం కలిగింది. మేము అస్తవ్యస్తంగా కనిపించే యువకులమే కావచ్చు. కానీ ఆ సమావేశాల ఆడంబరాన్ని చూసి భయపడలేదు. ప్రశ్నించడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం పట్ల మాకు ఉన్న ఆసక్తే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేది.
1972లో జరిగిన యువజన కాంగ్రెస్ మహాసభలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో మేము మాట్లాడే అవకాశం పొందాం. అనేక అంశాలపై ఆమెను ధైర్యంగా ప్రశ్నించేవాళ్లం. అయితే ఆమె సమాధానాల తీరు మాత్రం మమ్మల్ని ఆకట్టుకునేది. అధికారాన్ని చూసి భయపడని కాలం అది. ప్రశ్నించడం సహజ స్వభావంగా ఉన్న యుగం అది. దేశంలో ఎమర్జెన్సీ అమలుకాక ముందు ఆలోచనా స్వేచ్ఛ ఉత్సాహంగా వెలిగిన రోజులవి. కాలం గడిచేకొద్దీ యవ్వనం ముగిసి, మేమంతా జీవితంలో వేర్వేరు దారులను ఎంచుకుని ముందుకు సాగిపోయాం. గోపాల్ జీవితంలో ఎన్నో పనులు చేశాడు. కానీ చివరికి ఆయన తనను పూర్తిగా అంకితం చేసుకున్న పని మాత్రం నిజంగా జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం పొందాల్సినదే. దురదృష్టవశాత్తూ, ఆ గౌరవం ఆయనకు తన దేశం నుంచి రాలేదు. పద్మ అవార్డుల కోసం మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో నేను స్వయంగా గోపాల్ పేరు నమోదు చేసి, ఆయన వివరాలను అప్‌లోడ్ చేశాను. అయితే ఆయన రాజకీయ గతం, వామపక్ష ఆలోచనలతో ఉన్న అనుబంధం చూసిన ఏదో చిన్నస్థాయి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఆ సిఫారసును తిరస్కరించి ఉండవచ్చు. సమాజ సేవకులను మన వ్యవస్థ ఎలా గౌరవిస్తుందో ఇది చెప్పకనే చెబుతుంది.
భారతదేశం గుర్తించకపోయినా, ఫ్రాన్స్ మాత్రం గోపాల్ సేవలను గుర్తించింది. పారిస్ అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనలో ఆయనకు గ్లోబల్ ఛాంపియన్ వాటర్ ఇన్నోవేషన్ ప్రైజ్ ప్రదానం చేశారు. గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణపై గోపాల్ ఆసక్తి డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీలో పనిచేసిన రోజులనుంచే పెరిగింది. అయితే ఆ సంస్థలో ఆర్థిక పారదర్శకత లేదని భావించిన గోపాల్, తరువాత తన సొంత సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ కన్సర్న్స్‌ను స్థాపించారు. అక్కడే ఆయన స్వార్ (ఎస్‌డబ్ల్యుఎఆర్) అనే వినూత్న నీటి సంరక్షణ విధానాన్ని అభివృద్ధి చేశాడు. సిస్టమ్ ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రెజువెనేషన్ పేరుతో రూపొందించిన ఈ విధానం, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నం. ఈ విధానం ఎలా పనిచేస్తుందో చూపించేందుకు ఆసక్తి ఉన్న వారిని స్వయంగా తీసుకెళ్లి గంటల తరబడి వివరించేవాడు. తన ఆవిష్కరణపై ఆయనకు ఉన్న నమ్మకం, ఆత్మీయత స్పష్టంగా కనిపించేది. సాంప్రదాయ డ్రిప్ ఇరిగేషన్‌లో పైపులకు చిన్న రంధ్రాలు పెట్టి నీటిని నేలపై చిందిస్తారు. దాంతో కొంత నీరు ఆవిరైపోయి వృథా అవుతుంది. మొక్కల వేర్లకు కూడా తగిన తేమ ఎప్పుడూ అందకపోవచ్చు. కానీ గోపాల్ రూపొందించిన స్వార్ విధానంలో పైపులను నేల కింద పాతిన మట్టికుండలతో అనుసంధానించేవారు. ఆ కుండలు నెమ్మదిగా చెమటపట్టినట్టుగా తేమను విడుదల చేస్తూ, మొక్కల వేర్లకు నిరంతర నీటి సరఫరా అందించేవి. పైభాగం నేల ఎండిపోయినట్టే కనిపించినా, ఒకటి రెండు అడుగులు తవ్వితే వేర్ల చుట్టూ తేమ సమృద్ధిగా ఉండేది. అదే పంటలకు మంచి దిగుబడిని అందించేది.
గోపాల్ చేతులకు ఎప్పుడూ మట్టి అంటుకునేది. కానీ ఆ మట్టిలోనే ఆయన భవిష్యత్తును, ప్రకృతిని, రైతు జీవనాన్ని కాపాడే మార్గాన్ని వెతికారు. వాణిజ్యం, వ్యాపార విద్యతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన గోపాల్, తరువాత స్వయంకృషితో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదిగారు. నేల స్వభావం, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం వంటి అంశాలపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం అసాధారణం. ఫ్రాన్స్‌లో పురస్కారం అందుకున్న తరువాత, అమెరికా నుంచి కూడా ఆయనకు మరో గౌరవం లభించింది. ఆయన రూపొందించిన నీటి సంరక్షణ విధానం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం ప్రారంభమైనప్పటికీ, గోపాల్ మాత్రం తెలంగాణ నేలతోనే మమేకమై ఉన్నారు. ప్రభుత్వాలు వివిధ కారణాలతో స్వచ్ఛంద సంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో, ఎన్‌జిఒల ప్రతిష్ఠను కాపాడేందుకు గోపాల్ ఎంతో ఆవేదనతో పోరాడారు. అదే సమయంలో జహీరాబాద్ తాలూకాలో వేలాది మహిళలకు సహాయం చేయాలనే తపన కూడా ఆయనను మరింత కట్టిపడేసింది. డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ తమ హామీలను నెరవేర్చలేదని గోపాల్ ఆరోపించారు. ఆ విషయంపై ఆ సంస్థ ట్రస్టీలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. కానీ మహిళల సంక్షేమంకోసం ఆయన చూపిన నిబద్ధత కారణంగా, జహీరాబాద్ ప్రాంతంలోని మహిళలు ఆయనను ఎంతో అభిమానంతో చూసేవారు.
భారత పరిపాలనా సేవలో పనిచేసిన నా తండ్రి, నేను కాలేజీ రోజుల్లో ఎవరితో తిరుగుతున్నాననే విషయంపై ప్రత్యేకంగా అభ్యంతరం చెప్పేవారు కాదు, అలాగని సమర్థించేవారు కూడా కాదు. అయితే సంవత్సరాల తరువాత నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, గోపాల్ తన సమయాన్ని మరింత విలువైన పనుల కోసం వినియోగిస్తున్నారు అని నాతో చెప్పేవారు. రిటైర్మెంట్ అనంతరం నా తండ్రి అనేక స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తూ సమాజ సేవలో ఎక్కువ సమయం గడిపారు. ఆ సమయంలో గోపాల్‌తో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది. వారు కేవలం సేవా కార్యక్రమాల గురించే కాకుండా, ప్రపంచ పరిస్థితుల గురించి కూడా చర్చించేవారు. ఈ మధ్య నీకంటే మీ నాన్నగారే నాకు ఎక్కువ ఆసక్తికరంగా అనిపిస్తున్నారు. దగ్గరయ్యారు అని గోపాల్ నన్ను సరదాగా ఆటపట్టించేవారు. నేను కుర్చీలో కూర్చొని వ్యాసాలు రాసే కాలమిస్టును మాత్రమే. కానీ గోపాల్ చేతులకు మాత్రం మట్టి అంటుకునేది. భూమితో, రైతుతో, ప్రకృతితో ఆయనకు ఉన్న బంధం అపరిమితమైనది. సీతారాం ఏచూరి మరణించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా పాఠశాల, కళాశాల రోజుల స్నేహితులను ఒకచోట చేర్చి ఆన్‌లైన్ స్మారక సభను నిర్వహించారు గోపాల్. జీవితంలో మేము వేర్వేరు దారులు ఎంచుకున్నప్పటికీ, 1960 70 దశకాల హైదరాబాద్ మమ్మల్ని అందరినీ ఒకే భావజాలంతో మలిచింది. ప్రశ్నించే స్వభావం, భావోద్వేగంతో కూడిన కలల ప్రపంచం, సమాజంపై బాధ్యతా భావం, స్నేహంపై నమ్మకం ఇవన్నీ మాలో అలాగే మిగిలిపోయాయి. నిజమైన హైదరాబాదీల్లా మేము మంచి స్నేహితులుగానే కొనసాగాం. ఒక్కొక్కరుగా మనుషులు దూరమవుతున్నా.. మనసుల్లో మాత్రం ఆ జ్ఞాపకాల మాధుర్యం నిలిచిపోయింది.
సంజయ్ బారు
(రచయిత సీనియర్ సంపాదకులు, మాజీ ప్రధాన మంత్రి మీడియా సలహాదారు)












