కాక్రోచ్ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసనలు తెలపడం ప్రజలకు రాజ్యంగం కల్పించిన హక్కు అని, ఆందోళన సాకుగా వారిపై బలప్రయోగం చేయడాన్ని సమర్ధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలను నియంత్రించేందుకు చట్టబద్ధమైన విధానాలనే అనుసరించాలని సూచించింది. నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై ఏకరూప మార్గదర్శకాలను రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. నీట్-యూజీ సహా పలు పోటీ పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యార్థుల నిరసలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జిలు జరపడంపై దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం సోమవారంనాడు విచారణ చేపట్టింది. పోలీసులపై సైతం నిరసకారులు దాడులు చేసినట్టు న్యాయవాది ఒకరు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

పోలీసుల జీవితమూ విలువైనదేనని, పోలీసుల భద్రతలను సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరమని, పోలీసుల చర్యతో పాటు, నిరసనకారుల హింసపైనా నిష్పాక్షిక దర్యాప్తు ఉండాలని పేర్కొంది. శాంతియుత నిరసనలు, పోలీసు చర్యలపై దేశమంతంటా ఏకరూప మార్గదర్శకాలు అవసరమని అభిప్రాయపడింది. కాగా, బీహార్‌లో నిరసనకారులపై పోలీసులు ఏకే-47 ఉపయోగించినట్టు తెలుస్తోందని న్యాయవాది ఫౌజియాషాకిల్ కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు పోలీసులపైనా నిరసనకారులు దాడులకు పాల్పడ్డారని వారి కుటుంబాల తరఫున పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ అంశాలు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్న అశాంలను ధర్మాసనం అభిప్రాయపడుతూ... అన్ని పిటిషన్లను ఈనెల 28న సమగ్రమంగా విచారిస్తామని తెలిపింది.