‘కె.జి.ఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్‌ నుంచి వచ్చిన సినిమా ‘టాక్సిక్’. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమా ఊహించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో హీరో యశ్‌కు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి మద్దతుగా నిలిచారు. ఈ సినిమాను, యశ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

‘‘ఒక నటుడిగా ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు.. దానికి పూర్తిస్థాయిలో ప్రాణం పోసేందుకు మనస్పూర్తిగా ప్రయత్నిస్తాం. ఒక బలవంతుడి పోరాటాన్ని తెరపై చూపించిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, పాత్రల ప్రయాణం.. సాధారణ చిత్రాల్లా కమర్షియల్ పంథాలో సాగకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు ఎంచుకున్న దారి తప్పు అని కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలచి, తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో భారీ శ్రమ దాగి ఉంటుంది’’ అని రిషబ్ పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా కోసం, తన పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని రిషబ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదొక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న నీ తపనను మేం ప్రేమిస్తున్నాం’ అని యశ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. అలాగే దర్శకురాలు గీతు మోహన్‌దాస్, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్‌తో పాటు కన్నడ అగ్రహీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కూడా టాక్సిక్ సినిమాకు, యశ్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.