
టాలీవుడ్ లో గత వారం పదిరోజులుగా ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం మోగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్ నారాయణ, దిల్‌రాజు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను చిరంజీవికి వివరించినట్లు సమాచారం. అలాగే, పర్సంటేజ్ విధానంలో సినిమాల విడుదలపై చర్చించారు. ఎగ్జిబిటర్ల బృందంతో సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి.. గిల్డ్ నిర్మాతలకు కాల్ చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్లతో సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. సింగిల్ స్క్రీన్ సమస్యలు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లామని.. మరో రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.










