టీం ఇండియా అభిమానులకు బిసిసిఐ శుభవార్త అందించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం తిరగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్‌కి పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడు జట్టుకు దూరం కావడంతో.. అతడు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. అయితే త్వరలో జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఉంది. కానీ, అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటేనే ఆడుతాడని అధికారులు తెలిపారు.

అయితే ఇప్పుడు బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తీపి కబురు అందించింది. బుమ్రా ఫుల్ ఫిట్‌గా ఉన్నాడని తెలిపింది. దీంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో అతడు ఆడటం ఖాయమే. ‘‘జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. ఇప్పటికే స్క్వాడ్‌లో ఉన్న అతడు.. రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడు’’ అని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడటం భారత్‌కు అత్యంత కీలకం. ఇద్దరు ప్రధాన పేసర్లు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా ఉంటే ప్రత్యర్థి లంక బ్యాటర్లు హడలెత్తడం ఖాయం.