ఇన్-సర్వీస్ టీచర్స్- కోసం టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, సంక్షేమ శాఖ విద్యాసంస్థలు, మోడల్ స్కూళ్లు, తదితర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. టీచర్ల అర్హతలను నిర్ధారించడం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచిన నిబంధనలు, షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బుధవారం నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి..

సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం..ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి, తదుపరి పదోన్నతులు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్‌లతో పాటు ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. టెట్‌కు దరఖాస్తు విధానం, అర్హతలు, ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరారు. ***