
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడానికి, బీజేపీని గెలిపించడానికి మొత్తం క్యాబినెట్, 19 మంది ముఖ్యమంత్రులను బీజేపీ రంగం లోకి దించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. హూగ్లీ జిల్లా ఉత్తరపర వద్ద ఎన్నికల ర్యాలీలో శనివారం ఆమె ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులకు బీజేపీ కపట వాగ్దాలను ఇస్తోందని ఆరోపించారు.
నిరాశలో ఉన్న బీజేపీ ప్రధాని మోడీ నుంచి హోం, రైల్వే, రక్షణ, మంత్రులతోపాటు ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాలకు చెందిన 19 మంది ముఖ్యమంత్రులను 50 హెలికాప్టర్లతో ఈ ఒక్క రాష్ట్రంలోకి దించిందని, దీనితో పోల్చుకుంటే కేవలం మూడు హెలికాప్టర్లనే టిఎంసి వినియోగించిందని మమతా బెనర్జీ పోల్చి చెప్పారు. ఫలితాల తర్వాత టీఎంసీకి మద్దతు ఇచ్చిన గూండాలను తలకిందులుగా వేలాడదీస్తారని కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక కేంద్ర మంత్రిగా, బాధ్యతాయుత నాయకునిగా అలాంటి మాటలు మాట్లాడ కూడదని మమతా బెనర్జీ హెచ్చరించారు.
ఉగ్రవాద భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. “ మీకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోరని నాకు తెలుసు. కానీ ఆ ప్రసంగాన్ని వీడియో గ్రాఫ్ తీసి దాన్ని కోర్టుకు సమర్పించాలని మా మనుషులకు చెప్పాను” అని మమత ధ్వజమెత్తారు. తమ నియోజకవర్గం భవానీపూర్‌కు బయట నుంచి 400 మందిని తీసుకు వచ్చారని, వారంతా బయటకు తరిమివేయబడ్డారని, అలాంటి వారిని గుర్తించడానికి ప్రతిహోటల్,గెస్ట్‌హౌస్‌లో నిషేధం విధించాలని తాను ప్రతివారిని అభ్యర్థిస్తున్నానని తెలిపారు.












