తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ (టిఆర్‌ఈఐఎస్) సోమవారం టిఎస్‌ఆర్‌జెసి సెట్- 2026 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgrjc.cgg.gov.in నుండి తమ అడ్మిట్ కార్డులను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టిఆర్‌ఈఐఎస్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్ష మే 3 న ఆదివారం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రెండున్నర గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం 150 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, లేనిపక్షంలో పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని సంస్థ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవని, అభ్యర్థులు ముందుగానే ప్రింటౌట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ముందుగా tgrjc.cgg.gov.in వ్బ్సైట్ను సందర్శించాలని, హోమ్ పేజీలో టిఎస్‌ఆర్‌జెసి సెట్ హాల్ టికెట్ 2026’ లింక్ పై క్లిక్ చేయాలని, అభ్యర్థి ఐడి లేదా అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్క్రీన్ పై కనిపించే హాల్ టిక్కెట్ వివరాలను సరిచూసుకోవాలని కోరింది. చివరగా డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవాలని సూచించింది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తకుండా అభ్యర్థులు త్వరగా తమ అడ్మిట్ కార్డ్లను పొందాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష విధానంపై అవగాహన కోసం మోడల్ పేపర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.