అమరావతి: టిడిపి ఎంఎల్‌ఎ అమిలినేని సురేంద్రబాబు అనుచరులు టోల్ సిబ్బందిపై దాడి చేయడంతో మహిళ ఉద్యోగి జట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె- తిరుపతి జాతీయ రహదారిలోని గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టిడిపి ఎంఎల్‌ఎ అమిలినేని సురేంద్రబాబు తన అనుచరులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తిరుగుపయనమయ్యారు. గండబోయినపల్లె టోల్‌గేటు వద్దకు రాగానే టోల్ ఫీజు చెల్లించాలని ఎంఎల్‌ఎ అనుచరుల వాహనాలకు అడిగారు, వెంటనే కారులో నుంచి ఎంఎల్‌ఎ అనుచరులు, గన్‌మెన్ బయటకు దిగి టోల్ సిబ్బందిపై దాడి చేశారు. మహిళా సిబ్బంది జట్టు పట్టుకొని తీవ్రంగా కొట్టారు. మేనేజర్ రవిపై కూడా దాడి చేశారు. ఈ ఘటన సిసికెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ సిబ్బంది కారులో ఎక్కించుకొని వాల్సీకిపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎంఎల్‌ఎ అనుచరుల ఫిర్యాదు మేరకు సిఐ రాఘవ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ సమక్షంలో ఎంఎల్‌ఎ, అనుచరులు టోల్ ప్లాజా సిబ్బంది క్షమాపణలు చెప్పించుకున్నారు. ప్రభుత్వం ఏదైనా స్థానికంగా పాలించేది రౌడీలే అని అందరికీ తెలిసిందే అని శేఖర్ బండారు అనే నెటిజన్ కామెంట్ చేశారు. టిడపి ఎంఎల్ఎ, నేతలు  తన అనుచరులను అదుపులోకి ఉంచుకోవాలని లేకపోతే మరో బీహార్ గా మారే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు సదరు ఎంఎల్ఎ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేకపోతే కెసిఆర్ కు పట్టిన గతే చంద్రబాబు నాయుడు కు పడుతుందని హరీష్ రెడ్డి అలేటి అనే నెటిజన్ కామెంట్ చేశారు.