
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే ఉన్నది కాసేపే అయినా.. కోహ్లీ, ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘భారీ షాట్లు కొట్టు’ అంటూ హెడ్ కోహ్లీని రెచ్చగొట్టాడు.
దీనికి కోహ్లీ ధీటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘నువ్వు ఆఫ్ స్పిన్ వేయడానికి వస్తే అదే చేస్తా. అయినా, నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా’’ అంటూ హీట్ పెంచాడు. అయితే ఈసారి మ్యాచ్‌లో హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ కాకపోవడం గమనార్హం. ఆఖర్లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన హెడ్ రజత్ పాటిదర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తన ఇన్‌స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. ‘అవతలి వ్యక్తి ఊహించడం కూడా అసాధ్యం అన్న రీతిలో మన ప్రదర్శన ఉండాలి’ అని అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు.
అయితే అప్పటితో ఈ వివాదం ముగియలేదు. నిజానికి కోహ్లీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంత దూకుడుగా ఉంటాడో.. మ్యాచ్ ముగిసిన అనంతరం అంతే హుందాగా వ్యవహరిస్తాడు. కానీ, ఈ మ్యాచ్ ముగిసి ఆటగాళ్లు అందరూ షేక్ హ్యాండ్ చేసుకుంటున్న సమయంలో ట్రావిస్ హెడ్ చేయి ఇచ్చినా విరాట్ పట్టించుకోలేదు. వెనక ఉన్న ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హెడ్ కొన్ని క్షణాలు అలానే చూసి ముందుకు సాగిపోయాడు. దీంతో కోహ్లీ ఇలా చేశాడు ఏంటీ అని అంతా చర్చించుకుంటున్నారు.













