న్యూఢిల్లీ ః నటి ట్విషా శర్మ వివాదాస్పద మృతి కేసులో న్యాయస్థానంపై తప్పుడు ప్రచారం బాధాకరం అని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను తాము రక్షిస్తున్నామనే విధంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇది చాలా తప్పు అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం తెలిపింది. ట్విషా శర్మ మృతి కేసుపై సమగ్ర, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చేస్తామని సిజెఐ హామీ ఇచ్చారు. ఈ నెల 12న భోపాల్‌లో అత్తవారింట్లో మిసెస్ శర్మ మృతి చెందారు. ఆత్మహత్యగా దీనిని ముందు తేల్చారు.

అయితే వరకట్నం వేధింపుల క్రమంలోనే భర్త , అత్త ఇతరుల వత్తిళ్లతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని పుట్టింటి వారు ఫిర్యాదు చేశారు. దీనితో ట్విషా శర్మ మృతదేహానికి ఇటీవలే పోస్టుమార్టం జరిగింది. సోమవారం నిదేదిక రావల్సి ఉంది. భర్త సమర్ధ్ సింగ్ లాయర్, అత్తగారు పూర్వపు జడ్జి కావడంతో నిందితులను కోర్టులు రక్షిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. దయచేసి మీడియా ఇటువంటి విషయాలలో స్వయం నియంత్రణ పాటించాల్సి ఉంది.

కేసు విచారణ వివరాలు నిర్థారణ లేకుండా వెలుగులోకి తేరాదు. తెచ్చే క్రమంలో న్యాయస్థానాన్ని కానీ ఇతరులను కూడా వేదనకు గురి చేసే విధంగా ప్రచారం చేయరాదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మీడియాలో కొందరు మిత్రుల వ్యవహారశైలి తమకు బాధ కల్గిస్తోంది. కేవలం ప్రకటనల ఆధారంగా వార్తలకు దిగకండి. చట్టం తన పని తాను చేసుకోనివ్వండి. విచారణ సజావుగా సాగుతోంది. కోర్టులను కించపరిచే వ్యాఖ్యలతో ఫలితం ఉండదన్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐ చేపడుతుందని, సంబంధిత ఏర్పాట్లకు ఇప్పుడే దిగుతున్నామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసానికి తెలిపారు.