
ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ట్విషా కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. భోపాల్‌లోని తన అత్తింట్లో ట్విషా మృతి చెందిన ఘటనను కుటుంబ సభ్యులు మొదటి నుంచే అనుమానాస్పదంగా పేర్కొంటున్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తు అవసరమని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే దిగువ కోర్టు రెండో పోస్టుమార్టం అభ్యర్థనను తిరస్కరించడంతో ట్విషా కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు రెండో పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.ఈ పోస్టుమార్టాన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల బృందం నిర్వహించనుంది. అయితే పరీక్ష భోపాల్‌లోనే జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్‌కు తీసుకురానున్నారు. ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇదే సమయంలో ట్విషా భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. తాను ట్రయల్ కోర్టు ముందు లొంగిపోయి అక్కడే బెయిల్ కోరనున్నట్లు కోర్టుకు తెలిపారు. ట్విషా మృతి అనంతరం నుంచి సమర్థ్ సింగ్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, రెండో పోస్టుమార్టం నివేదికతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మోడల్, నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో పోస్టుమార్టానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.రాష్ట్ర ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో పోస్టుమార్టం నిర్వహించడం అంటే ఎవరిపైనా నేరారోపణ చేయడం కాదని, ఇది అన్ని వర్గాల్లో నమ్మకాన్ని పెంచుతుందని కోర్టుకు తెలిపారు.
మొదటి పోస్టుమార్టం నివేదిక సరిగానే ఉందనే నమ్మకం తనకు ఉందని, వైద్యుల సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. అయితే ట్విషా కుటుంబ సభ్యులు మొదటి పోస్టుమార్టంలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ట్విషా మృతదేహం లభించిన మూడు రోజుల తర్వాత మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వారు పేర్కొన్నారు. ఉరి వేసుకున్నట్లు చెబుతున్న వస్తువును మొదటి పోస్టుమార్టం సమయంలో పరిశీలనకు ఇవ్వలేదని కూడా ఆరోపించారు.ట్విషా తరఫు న్యాయవాది మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఆమె శరీరంపై కనిపించిన గాయాల గురించి పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైన వివరాలు లేవని పేర్కొన్నారు. అలాగే పోస్టుమార్టంలో నమోదైన ట్విషా ఎత్తు, పోలీసుల నివేదికలో ఉన్న ఎత్తుతో సరిపోలడం లేదని తెలిపారు.
మోడల్, నటి అయిన ట్విషా శర్మ ఈ నెల 12న భోపాల్‌లోని తన అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యాయవాది సమర్థ్ సింగ్‌తో ఆమెకు ఐదు నెలల క్రితమే వివాహమైంది. 2024లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడగా, 2025 డిసెంబరులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తెను భర్త, అత్తింటివారు శారీరకంగా, మానసికంగా వేధించేవారని ట్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్విషా తన తల్లి రేఖా శర్మకు పంపిన వాట్సాప్ సందేశాల్లో కూడా అసంతృప్తికరమైన వివాహ జీవితంలో తాను చిక్కుకుపోయానని, అత్తింటి వారి నుంచి మానసిక వేధింపులు, కట్న వేధింపులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో రెండో పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.













