
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి పరిసర ప్రాంతాల్లో వీచిన ఈదురు గాలులతో అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు ఒక్కసారిగా నేల కూలాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో ఇలాంటి ఈదురుగాలులను ఇప్పటివరకు చూడలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వీచిన ఈదురుగాలులకు మంగపేట కోమటిపల్లి వెళ్లే దారిలో భారీ చెట్లు నేలకూలాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలను తీసుకొని వెళ్లి భారీ చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ఈ విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ లాయిక్ హుస్సేన్‌ను వివరణ కోరగా.. వర్షం ఎక్కువగా వస్తున్న కారణంగా లోపలికి వెళ్లలేకపోయాం,
రోడ్డు వెంట కేవలం 10 నుంచి 15 చెట్ల వరకు కూలిపోయినట్టు తెలిపారు. లోపల శాంతినగర్, గోత్తికోయగూడెంలో వృక్షాలు ఏమైనా కూలిపోయాయో లేదో, బుధవారం పరిశీలించి పూర్తి వివరాలను అందిస్తామని తెలిపారు. అయితే, గతేడాది తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ అటవీ ప్రాంతంలో టోర్నడో తరహాలో వీచిన గాలులను ఈ గాలులు తలపించాయని స్థానికులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి, యూత్ జిల్లా నాయకులు కబ్బాక లక్ష్మణ్, ఎమ్మార్వో రవీందర్, ఆర్‌ఐ శ్రీనివాస్, కల్వల రాజిరెడ్డి, బట్ట సురేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.











