
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి
స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను
రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే
తాతా మధుపై చర్యలు తీసుకోవాలి.. వెంటనే సస్పెండ్ చేయాలి
తాతా మధు వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని, తాతా మధు వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి తాను సంఘీభావం ప్రకటించానన్నారు. స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు అని, రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనని, ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.
ఒక అట్టడుగు వర్గాల బిడ్డ, దళిత బిడ్డ శాసనసభ స్పీకర్‌గా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సభకు రాకుండా ఉంటారని, కానీ ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడినా కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. శాసనసభ, స్పీకర్ పదవి పట్ల కనీస గౌరవం లేని విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ధ్వజమెత్తారు. ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని సూచించారు.













