
హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం కెసిఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ అని కొనియాడారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశంలోనే వెనుకంజలో ఉన్నారని విమర్శించారు. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం అధోగతేనని, ప్రతిపక్షంలో ఉన్న వారికి రాజకీయ వేధింపులు ఉన్నాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే హోం మంత్రి అని సబితా పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏం సమీక్షలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హోం శాఖ తప్ప అన్ని సమీక్షలు జరుగుతున్నాయని, హోంశాఖకు సంబంధించి కెసిఆర్ సంస్కరణలు తెచ్చారని తెలియజేశారు.
ఎక్కడ ఏ చిన్న క్రైం జరిగినా మానిటరింగ్ చేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారని, హైదరాబాద్ లో 12 లక్షల సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేయొచ్చనని, కానీ ఇవాళ ఎలాంటి మానిటరింగ్ జరగడం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని, శుక్రవారం మాజీ ఐఫిఎస్ అధికారి భార్య హత్య జరగడం బాధాకరం అని అన్నారు. అదే స్థానంలో ఒక సాధారణ మహిళ ఉండి ఉంటే ఏం జరిగేది? అని ప్రశ్నించారు. ఎన్ సిఆర్ బి రిపోర్టు ఆందోళన కలిగిస్తోందని, తెలంగాణ నేరాలకు అడ్డాగా మారిందని నివేదిక తేల్చి చెప్పిందని అన్నారు. దేశమంతా క్రైం తగ్గుముఖం పడితే తెలంగాణలో పెరిగిందని, తెలంగాణలో 18.07 శాతం నేరాలు పెరిగాయని, కుప్పకూలిన శాంతి భద్రతలకు ఇది నిదర్శనం అని సబితా ఇంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు.












