
తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ.. దర్శకత్వం కూడా చేసిన సినిమా ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. తెలుగమ్మాయి శాన్వి మేఘన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. గతేడాది ఈ సినిమా గురించి న్యూస్ వచ్చింది. అయితే ఈ సినిమాను నేరుగా ఒటిటిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రముఖ ఒటిటి వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
ఈ సినిమా విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి (శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం వస్తాడు. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.











