మన కాళ్ళ కింద నిశ్శబ్దంగా ఒక భారీ పర్యావరణ సంక్షోభం పెరుగుతోంది. భూమి చర్మంగా పిలువబడే నేల, వాతావరణ మార్పులు, అధిక రసాయన ఆధారిత వ్యవసాయం, అటవీ వినాశనం, భూమి అధిక వినియోగం, అనారోగ్యకరమైన వ్యవసాయ పద్ధతుల కారణంగా వేగంగా క్షీణిస్తోంది. సారవంతమైన భూమికి ప్రాణాధారమైన మట్టిలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం ఆహారభద్రత, జీవవైవిధ్యం, నీటివ్యవస్థ, ప్రపంచ వాతావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేల అనేది కేవలం మట్టి కాదు. ఇది జీవంతో నిండిన ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థ. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 95% కంటే ఎక్కువ భాగం నేలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా భూమిపై ఉన్న జీవవైవిధ్యం లో దాదాపు మూడింట రెండొంతుల ఇది నివాసంగా ఉంటుంది. ప్రపంచ అంచనాల ప్రకారం, మంచు లేని భూభాగంలో దాదాపు మూడో వంతు ఇప్పటికే మానవ చర్యల వల్ల క్షీణించింది. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం, నీటి కొరతతోపాటు నేల క్షీణతను కూడా ఒక ప్రధాన ప్రపంచ సంక్షోభంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నేల క్షీణత, వాతావరణ మార్పు ఒకదానితో మరొకటి బలంగా అనుసంధానమై ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరువులు, వరదలు, అడవి అగ్నిప్రమాదాలు మట్టిలోని సేంద్రియ కార్బన్‌ను వేగంగా తగ్గిస్తున్నాయి. అదే సమయంలో క్షీణించిన నేలలో నిల్వ ఉన్న కార్బన్ భారీ స్థాయిలో వాతావరణంలోకి విడుదలై గ్లోబల్ వార్మింగ్‌ను మరింత తీవ్రతరం చేస్తోంది. 1960 2020 మధ్య కాలంలో అడవులు, తడిబయళ్లు, గడ్డిభూములు వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ కర్బనం స్థాయిలో గణనీయంగా తగ్గాయి. సహజ పర్యావరణ ప్రాంతాలను సాగుభూములుగా మార్చడం వల్ల నేల కార్బన్ 15 నుండి 25 శాతం వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాగుభూములను తిరిగి అడవులు లేదా గడ్డి భూములుగా మార్చితే కార్బన్ స్థాయిలు 60 శాతం వరకు పెరగవచ్చు. అయితే ఈ పునరుద్ధరణకు దశాబ్దాల సమయం పట్టవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. లక్షలాది చిన్న రైతులు అత్యల్ప సేంద్రియ కార్బన్ ఉన్న భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అనేక ఉష్ణమండల వ్యవసాయ ప్రాంతాల్లో సేంద్రియ కార్బన్ స్థాయిలు ఆరోగ్యకర ప్రమాణాల కంటే చాలా తక్కువగా, 0.1 శాతం వరకు పడిపోయాయి. నేలనాశనాన్ని వేగవంతం చేస్తున్న అనారోగ్యకర వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేల క్షీణతకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అధిక దున్నకం, అసమతుల్య రసాయన ఎరువుల వినియోగం, వరద ఆధారిత సాగు, పంట అవశేషాల దహనం, అధిక మేత వంటి చర్యలు నేల నిర్మాణాన్ని దెబ్బతీసి సారాన్ని తగ్గిస్తున్నాయి. భారీ వ్యవసాయ యంత్రాల వినియోగంవల్ల నేల గట్టిపడటం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. నేల గట్టిపడినప్పుడు నీటి చొరబాటు తగ్గిపోతుంది, మొక్కల వేర్లు పెరగలేవు, గాలి చలనం తగ్గుతుంది. దీని వల్ల పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరిత గృహవాయువుల ఉద్గారాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా దక్షిణాసియాలో విస్తృతంగా కనిపించే పంట అవశేషాల దహనం నేల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తోంది. గోధుమ విత్తనాల కోసం పొలాలను త్వరగా సిద్ధం చేయడానికి రైతులు వరి గడ్డిని కాల్చడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈ పద్ధతి నేలలోని కార్బన్‌ను తీవ్రంగా తగ్గించి వాయు కాలుష్యం, వాతావరణ మార్పులను పెంచుతోంది.

సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పటికీ, సరైన పునరుద్ధరణ చర్యల ద్వారా క్షీణించిన నేలలను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు. పునరుత్పాదక వ్యవసాయం, సంరక్షణ వ్యవసాయం, సేంద్రియ పదార్థాల వినియోగం, అగ్రో ఫారెస్ట్రీ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థల ద్వారా నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచితే నేలసారం, నీటి నిల్వసామర్థ్యం, జీవవైవిధ్యం, పంటల సహనశక్తి గణనీయంగా మెరుగుపడతాయి. ఆరోగ్యకరమైన నేలలు కార్బన్ నిల్వకేంద్రాలుగా పనిచేస్తాయి. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి భూమిలో నిల్వ చేస్తాయి. కార్బన్ సీక్వెస్ట్రేషన్‌గా పిలువబడే ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఒక ప్రధాన సహజ వాతావరణ పరిష్కారంగా భావిస్తున్నారు. సుస్థిర భూవినియోగ పద్ధతులు అనుసరించి నేలల్లో కార్బన్ నిల్వచేసే రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే కార్బన్ ఫార్మింగ్ విధానాన్ని కూడా పరిశోధకులు ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా పర్యావరణ పునరుద్ధరణకు సహకారం అందుతుంది. ప్రకృతికి భూమిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుత వ్యవసాయ విధానాలు ఇకపై కొనసాగలేవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో దాదాపు 40 శాతం ఇప్పటికే క్షీణించగా, ప్రతి సంవత్సరం విపరీతమైన ఆహారం వృథా అవుతోంది. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించాలంటే క్షీణించిన వ్యవసాయ భూములలో గణనీయమైన భాగాన్ని తిరిగి అడవులు, గడ్డి భూములు, సహజ పర్యావరణ వ్యవస్థలకు అప్పగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తక్కువ నీటితో అధిక ఫలితాలు ఇచ్చే డ్రిప్ ఫర్టిగేషన్ వంటి నీటి-సమర్థ సాంకేతికతలను విస్తృతంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. భవిష్యత్తు వ్యూహం తక్కువ వనరులతో ఎక్కువ ఆహారం ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు తక్కువ భూమి, తక్కువ నీరు, తక్కువ ఎరువులు, తక్కువ శక్తి వినియోగంతో అధిక ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉంది. నేల ఆరోగ్య పునరుద్ధరణకు ప్రభుత్వాల నుండి బలమైన విధాన మద్దతు అవసరమని పర్యావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు, పర్యావరణ సేవల చెల్లింపులు, సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల ద్వారా మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం వ్యవసాయ సమస్య మాత్రమే కాదు; మానవ నాగరికతకు సంబంధించిన సవాలు. నేల క్షీణత వాతావరణ స్థిరత్వం, ఆహార ఉత్పత్తి, నీటి భద్రత, జీవ వైవిధ్యం, అంతిమంగా ప్రపంచ శాంతి, మానవ మనుగడపై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యావరణ అస్థిరతను ఎదుర్కొంటున్న ఈ కాలంలో, భూమి నేలలు పునరుద్ధరించడం 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైన కర్తవ్యాలలో ఒకటిగా మారవచ్చు.