నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌత్ జోన్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఓవర్‌నైట్ స్కోరు 40/2తో సోమవారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన సౌత్ జోన్‌కు కెప్టెన్ తిలక్ వర్మ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తిలక్ అలరించాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సమరన్ రవిచంద్రన్ అండతో తిలక్ స్కోరును ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడిన రవిచంద్రన్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హిమతేజ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో తిలక్, శ్రేయస్ గోపాల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు నార్త్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు.

ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 169 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి ఆరో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తిలక్ అజేయ శతకం సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న తిలక్ 225 బంతుల్లో 11 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సౌత్ జోన్ ఆట నిలిపి వేసే సమయానికి 94 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. సౌత్‌కు ఇప్పటి వరకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కాగా, నార్త్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ నాలుగు, అర్ష్‌దీప్, అన్షుల్ కంబోజ్ చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు. ఇక సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఇక సెంట్రల్ బౌలర్లు అద్భుత ప్రతిభతో ఈస్ట్ జోన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఈస్ట్ జోన్ టీమ్‌లో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన వైభవ్ 81 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 69 పరుగులు చేశాడు. సుదిప్ కుమార్ (25) పరుగులు చేసి ఔటయ్యాడు. మిగత వారు విఫలం కావడంతో ఈస్ట్ జోన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో హర్ష్ దూబె నాలుగు, యశ్ ఠాకూర్, ఆర్యన్ మూడేసి వికెట్లను పడగొట్టారు.