
లక్నో: తల్లిని చంపేసిన తండ్రిని పోలీసులకు ఐదేళ్ల కుమారుడు పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....... బిజ్రారీ గ్రామంలో హనీఫ్(32), మనీషా(27) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం మనీషా ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. భార్య ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిందని పోలీసులకు హనీఫ్ సమాచారం ఇచ్చారు. పోలీసులు బిజ్రారీ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హనీఫ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తరువాత భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య తలపై కొడవలితో విచాక్షణ రహిత కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలు ఎనిమిది నెలల గర్భిణీగా గుర్తించారు. కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి హత్య చూసినప్పటి నుంచి కుమారుడు భయంతో వణికిపోయాడు. తన తల్లిని తండ్రి చంపాడని పోలీసులకు కుమారుడు తెలిపాడు. దీంతో తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడు భయాందోళనకు గురికావడంతో వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారు.











