
తల్లిదండ్రులిద్దరూ ఐఎఎస్‌లు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషసన్లు కల్పించడం అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు రిజర్వేషన్ల కల్పన మంచి పద్ధతి కాదని అభ్యంతరం తెలిపింది. ఎదిగిన స్థాయిల్లోని వారు బిసి వర్గాల ప్రయోజనాలను కూడా పొందుతామంటే కుదరదని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారు క్రిమిలియేర్ పరిధిలోకి రావడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఉన్నత స్థాయికి చేరుకున్న వారి కుటుంబాలు రిజర్వేషన్లు పొందకూడదనే నిబందనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే వీటిని సవాలు చేయడం భావ్యమా? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. రిజర్వేషన్ల కల్పనకు వర్తించేది కేవలం వారి ఆర్థిక వెనుకుబాటుతనమే , అయితే సామాజికంగా ముందుకు వెళ్లలేదనే వాదన ఇందులో జొప్పించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు సహజంగానే వారి పిల్లల స్థాయి కూడా పెరుగుతుంది. రిజర్వేషన్లను టోకుగా అమలు చేయడం కాకుండా నిర్థిష్టంగా పరిశీలించి అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఏది ఏమైనా ఆర్థిక పరిపుష్టి పొందిన కుటుంబాల వారు తమ తరువాతి తరాల వారు రిజర్వేషన్లు పొందవచ్చా? లేదా అనేది ఎవరికి వారే ఆలోచించుకుంటే మంచిదని హితవు పలికారు. పరిధి దిటిన తరువాత కూడా కొందరు రిజర్వేషన్లు పొందుతూ ఉండటంతో , ఈ క్రమంలో నిజంగానే వెనుకబడిన వర్గాల్లోని అవసరార్థులకు కోటా విషయంలో అన్యాయం జరుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన కర్నాటకకు చెందిన కుటుంబం వారి పిటిషన్ విచారణ చర్చకు దారితీసింది. అక్కడ పిటిషనరు కర్నాటక విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఎంపిక అయ్యారు. రిజర్వ్‌డ్ కేటగిరి వర్తింపచేయాల్సి ఉంది. అయితే జిల్లా కుల , ఆదాయ నిర్థారణ కమిటీ ఈ వ్యక్తికి కుల నిర్థారణ సంబంధిత రిజర్వేషన్ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కమిటీ పరిశీలపలో ఈ అభ్యర్థి తల్లిదండ్రులు ఐఎస్‌ఎస్ హోదాలలో ఉద్యోగాలలో ఉన్నారు. వారి ఆదాయం క్రిమిలేయర్ పరిధి దాటింది. ఇద్దరి సంయుక్త వేతనం రూ 8,00,000 దాటింది. ఇది ఆర్థిక పరిస్థితిని తెలియచేసే విషయం. మరి వారి కుటుంబానికి క్రిమిలేయర్ వర్తిస్తుందా? రిజర్వేషన్ల పరిధిలోకి వస్తారా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది.












