
కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
శివానీ మృతి నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది : చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్: షైనింగ్ స్టార్ అవార్డ్ తీసుకుంటానంటూ ఎపి సిఎం చంద్రబాబును మెప్పించిన పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న ముర్రం శివానీ అనే విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి, అకస్మాత్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
కేవలం మూడ్రోజుల క్రితమే ప్రభుత్వం చేపట్టిన ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ బాలిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి భోజనం చేయ డమే కాకుండా ఆయనతో సెల్ఫీ కూడా దిగిం ది. ఆ కార్యక్రమంలో జరిగిన పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లో తన అద్భుతమైన ప్రసంగంతో ముఖ్య మంత్రిని సైతం ఆకట్టుకుంది. వచ్చే ఏడాది తాను ’షైనిం గ్ స్టార్’ అవార్డును గెలుచుకుంటానని బాలిక ధీమా వ్యక్తం చేయగా, సిఎం చంద్రబాబు ఆమెను ఎంతగానో అభినందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, విచారణ చేప ట్టారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
ఆమె రాసిన సూసైడ్ నోట్ చూస్తుంటే ప్రతీ ఒక్కరి కళ్లు చమర్చుతున్నాయి. ‘అమ్మా, నాన్నా మీ కోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితాన్ని మీకు ఇద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలని ఉంది కానీ, బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ బాధను భరించడం నా వల్ల కావడం లేదు.. సారీ అమ్మా, క్షమించు నాన్నా’ అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుం బం ఐక్యంగా ఉండాలని కోరుకున్న ఆ బాలిక ‘అన్నయ్యా, వదినా, అమ్మా, అమ్మమ్మా.. మీరు ఎప్పటికైనా కలవండి, ఒకరినొకరు ద్వేషించుకో కండి.. సారీ బై బై’ అంటూ కుటుంబ సభ్యులను వేడుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. అంతా కలసి ఉండాలని ఆశపడిన కుటుంబం విడిపోయి ఉండటంతో మనస్తాపానికి గురై ఆ చిన్నారి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శివానీ మృతి నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది: చంద్రబాబు
ముర్రం శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటీవల రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని ఆత్మహత్య ఆవేదన కలిగించింది. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం చాలా బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుం డానే ఆ విద్యార్ధిని తనువు చాలించడం నన్ను కలిచివేస్తోంది.
శివాని మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా ఉండాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దు. ఎంతటి సమస్య కైనా పరిష్కారం ఉంటుంది. కనుక మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో, స్నేహితులతో పంచుకోండి. ఒత్తిడిని అధి గమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని’ చంద్రబాబు హామీ ఇచ్చారు.
కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.. ఫోరెన్సిక్‌కు సూసైడ్ నోట్...!
మరోవైపు శివాని ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శివాని మృతిపై ఆమె తల్లి సౌభాగ్యవతి రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన రంపచోడవరం పోలీసులు శివాని తల్లిదండ్రులు సౌభాగ్యవతి, మురళీకృష్ణను విచారించా రు. ఇక శివాని తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల క్రితమే విడిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆదివారం తండ్రి మురళీకృష్ణ వద్దకు వచ్చిన శివాని సాయంత్రం వరకూ అతని వద్దే ఉన్నట్లు తెలిసింది.
సీఐ నరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఘటనాస్థలికి ఎపిఎఫ్‌ఎస్‌ఎల్ , క్లూస్ టీమ్‌లు చేరుకుని ఆధారాలను సేకరించాయన్నారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారని, ఆ సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీ సులు పేర్కొన్నారు.











