
సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కెసిఆర్ పలు సూచనలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుడా హాజరుకావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలన్నారు. ఈ సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘శాసనసభ, మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజల అజెండానే బిఆర్ఎస్ అజెండాగా ఉంటాలి. కాంగ్రెస్, బిజెపి విధానాలను ఎండగట్టాలి. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై నిలదీయాలి. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ప్లాప్. తమ ప్రభుత్వం మళ్లీ రాదని కాంగ్రెస్ నేతలకు అర్థమైంది. అందుకే అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. నా చావు కోరుతూ పదే పదే మాట్లాడుతున్నారు. పాలన చేతకాకే రేవంత్ రెడ్డి బూతు పురాణం. అలాంటి వ్యక్తితో చర్చకు అసెంబ్లీకి రావాలా?’’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.













