
ప్రభుత్వ ఉద్యోగాలను ఉచితంగా ఇవ్వడం తగదు
కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇచ్చిన
ఉద్యోగాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు
చెన్నై: కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు)కు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి ని యామకాలకు అనుమతిస్తే, భవిష్యత్తులో మరెం తో మంది ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరేందుకు అవకాశం ఏర్పడుతుందని కోర్టు పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి విజయ్ కరూర్‌లో పర్యటించారు. పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కు టుంబాలకు కారుణ్య నియామకాల కింద ప్ర భుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో విజయ్ ప్రసంగించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారులతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ ఆలస్యంగా రావడంతో అనుమతించిన సామర్థ్యానికి మించి జనం భారీగా చేరుకున్నారని పోలీసులు ఆరోపించారు. తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు.. వంటి కనీస సౌకర్యాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం సహా పలు లోపాలను కూడా ప్రస్తావించారు. అయితే పోలీసుల ఆరోపణలను టీవీకే తిరస్కరించింది. పోలీసుల వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించింది.ఈ నెల ప్రారంభంలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి చట్టబద్ధ వారసుల్లో 32 మందికి ముఖ్యమంత్రి విజయ్ కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా ఈ ఉద్యోగాలను ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయకుమార్ తీవ్రంగా విమర్శించారు. దీనిని ‘ద్రోహం’గా అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సాధారణ కుటుంబాలకు చెందిన లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని ఆరోపించారు. చట్టబద్ధమైన సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని ఉదయకుమార్ ఆరోపించారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలన్నీ తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు.











