
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో పెను సంచలనం నమోదైంది. సెర్బియా యోధుడు, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. కెరీర్లో 25వ టైటిల్ సాధించాలని తహతహలాడుతున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్లో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనెతో జరిగిన పోరులో జకోవిచ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. దాదాపు నలుగున్నర గంటలకు పైగా సాగిన మారథాన్ సమరంలో నవోనె 76, 57, 46, 62, 61తో నాలుగో సీడ్ జకోవిచ్‌పై సంచలన విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్లో నవోనె జయకేతనం ఎగుర వేశాడు.
అయితే తర్వాత పుంజుకున్న జకోవిచ్ వరుసగా రెండు సెట్లు గెలిచి పైచేయి సాధించాడు. కానీ తర్వాతి సెట్లలో నవోనె అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అలవోకగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో జకోవిచ్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. మరో మ్యాచ్‌లో కజకిస్థాన్‌కు చెందిన 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు వోల్ఫ్‌తో జరిగిన తొలి రౌండ్లో బబ్లిక్ 64, 62, 36, 61తో జయభేరి మోగించాడు. అర్జెంటీనాకు చెందిన 27వ సీడ్ టొమస్ మార్టిన్ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో సోఫియా కెనిన్ (అమెరికా), 9వ సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్) తదితరులు తొలి రౌండ్లో విజయం సాధించారు.











