
మన తెలంగాణ/హైదరాబాద్: తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం అంగీకరించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు రేవంత్‌రెడ్డినే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని కెటిఆర్ ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వాహనదారులు, ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహారించడం దుర్మార్గమని కెటిఆర్ ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటల పాటు వాహనదారులు
నరకయాతన పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరూ కూడా స్పందించిన పాపాన పోలేదని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో ప్రతి ఏడాది వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి రాగానే తుంగలో తొక్కారని కెటిఆర్ విమర్శించారు.నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని, చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలు లేవని ఆయన ధ్వజమెత్తారు. వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఎన్‌డిపి, ఎస్‌ఆర్‌డిపి వంటి పకడ్బందీ ప్రణాళికలను అమలు చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను తీరిస్తే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ కథ మొదటికి తెచ్చారని ఆయన ఆరోపించారు.
ప్రజల చేతిలో శిక్ష తప్పదు
ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మృత్యువాడ పడినా చలనం లేని ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని కెటిఆర్ మండిపడ్డారు. కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్‌ను గాలికి వదిలేసిన సిఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కెటిఆర్ హెచ్చరించారు












