
ప్రజలు లేవనెత్తిన సమస్యలపట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించవు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపిన సందర్భాల్లో అణచివేతనే ఆయుధంగా వాడుకుంటాయి. సావధానంగా ఆలోచించవలసిన విషయాలను ప్రతిష్ఠగా తీసుకుని రకరకాల ఆరోపణలతో వాటిపై జాతి వ్యతిరేక రంగుపులిమి దారి మళ్లించే ప్రయత్నం చేస్తాయి. ఓట్లేసి గెలిపించాక తమ పాలనపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదనే భావన మన ప్రభుత్వాల్లో నాటుకుపోయింది. ప్రజా సంఘాలకు, జనసమూహాలకు మంత్రులు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు. ఉద్యమాలు లేవనెత్తిన తర్వాతే మంత్రి గారి దర్శనభాగ్యం లభిస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వేల మంది దూరప్రాంతాల నుంచి నిరసన స్థలానికి చేరుకోవడం అంటే తమ సమయాన్ని, డబ్బును త్యాగం చేయడమే అవుతుంది. తీరా చేరాక ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల దెబ్బలు ఎదుర్కోవలసిందే.
3, మే రోజున జరిగిన జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) పత్రం లీక్ అయిందని రుజువైంది. 22 లక్షల మంది ఎన్నో ఆశలతో రాసిన ఆ పరీక్ష 12, మే నాడు రద్దయింది. తట్టుకోలేని వేదనతో ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 21, జూన్ నాడు నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించారు. ఫేక్ సర్టిఫికెట్లతో లాయర్లు వస్తున్నారంటూ 15, మే రోజున సిజెఐ సూర్యకాంత్ నేటి నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పరాన్నజీవులు మాదిరి ‘బొద్దింకల్లా (కాక్రోచ్) ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత ఆయన దానికి సవరణ కూడా ఇచ్చారు. ఆ మాటకు నొచ్చుకున్న యువకుడు అభిజిత్ దీప్కే 16 న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అనే సైట్‌ను ఏర్పాటు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారం రోజుల్లోనే దానిలో రెండుకోట్ల మంది అనుచరగణం నమోదు అయింది. 6 జూన్ న సిజెపి నీట్ లీక్‌పై స్పందిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది.
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ 20, జూన్ నుండి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఆరంభించింది. లడక్ ఉద్యమకారుడైన సోనమ్ వాంగ్‌చుక్ ఈ డిమాండ్‌కు మద్దతుగా 28, జూన్ నుండి నిరాహార దీక్ష ఆరంభించాడు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. ఈ నెల 18 నాడు సోనమ్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగుతోంది. 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ఆరంభంలోపాటు సిజెపి ‘సంసద్ చలో’ పిలుపుతో ఢిల్లీ వేడెక్కింది. చివరకు శాంతియుతంగా సాగుతున్న కాక్రోచ్ పోరు పోలీసుల దాడితో రక్తసిక్తమైంది. ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్ ఆపేసినా యువతను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కొడుతున్న తీరు ఎన్నో వీడియోల ద్వారా ప్రపంచానికి తెలిసింది.
లాఠీలు ఝుళిపిస్తే, టియర్ గ్యాస్ వదిలేస్తే అందరూ ఎవరి దారిన వారు పరిగెత్తుకెళుతారు అని పోలీసులు భావించారు. అయితే అక్కడి దృశ్యాలు మాత్రం నయా గాంధీజాన్ని ప్రదర్శించాయి. కొడితే పారిపోతారనుకున్న యువకులు దెబ్బలకు తట్టుకోలేకున్నా ‘కొట్టండి! ఇంకా కొట్టండి!’ అంటూ అక్కడే నిలబడి పోయారు. అమ్మాయిలు సైతం పోలీసుల లాఠీలకు బెదరలేదు. ఎందరో యువతీ యువకులు వాటికి ఎదురు నిలిచి క్షతగాత్రులయ్యారు. ఒకవైపు వర్షం, మరోవైపు టియర్ గ్యాస్ కళ్ల మంట, పోలీసుల లాఠీ దెబ్బలు.. ఇవేవీ వేలమంది యువతీ యువకులను నిలువరించలేకపోయాయి. ఈ కాలపు సత్యాగ్రహాన్ని వారు ప్రదర్శించారు. ఇదంతా ప్రపంచం దృష్టిలో పడితే పరువు పోతుందనే భయంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు సిజెపి ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. వారి మధ్య రెండు మార్లు చర్చలు జరిగాయి. వారి డిమాండ్లు నడ్డా నుండి హోం మంత్రి అమిత్ షాకు చేరినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి అవి ప్రధాని మోడీ వద్దకు వెళతాయి. మోడీ, షా ద్వయం పూర్వాపరాలు, లాభనష్టాలు బేరీజీ వేసుకొని ఓ నిర్ణయానికి వస్తారు. ప్రభుత్వం తమ తప్పును అంగీకరించి ప్రజల కోరిక మేరకు నడుచుకుంటే బాగుంటుంది, కానీ దాని ఆలోచన రాజకీయ కోణంలో ఉంటుంది. ‘మీ ఇంట్లో అమ్మాయిలను ఇలాగే కొడతారా?’ అని ఓ యువతి పోలీసును నిలదీస్తున్న ప్రశ్న వారి చెవికెక్కదు. యువకుల నిరసన మాత్రం విద్యా మంత్రి రాజీనామా కోరుతూ నడుస్తోంది.
జంతర్‌మంతర్ వద్ద 21 నాటి సన్నివేశం 2020 లో రైతులు ఢిల్లీ కేంద్రంగా జరిపిన భారీ నిరసనను గుర్తుకొస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా ఢిల్లీ విడిచి వెళ్ళేది లేదన్న అన్నదాతల సంకల్పం కనిపిస్తోంది. అక్కడ ఏ రాజకీయ పార్టీ జెండా లేదు. రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిరసనను వదిలిపెట్టలేదు. యువకులు జంతర్ మంతర్ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు ముందుకొచ్చి భోజనం అందిస్తున్నారు. అన్ని మతాల వారు ఒకే గొంతుకగా ‘భారత్ మాతాకీ జై!’ అని నినదిస్తున్నారు. వీరిని పాకిస్తానీ ఏజెంట్లు అనో, అర్బన్ నక్సలైట్లనో కేసుల్లో ఇరికించే వీలు లేదు. విషయం చాలా దూరం వెళ్ళింది. ఒక మంత్రి రాజీనామా డిమాండ్ పెరిగి పెద్దదైతే మొదటికే మోసం వస్తుంది. దిగి రండి మోడీజీ! రైతుల నిరసనకు ఊపిరాడక ‘క్షమించండి!’ అన్నారు కదా! 19 నవంబర్ 2021 నాడు గురు పర్వ్ సందర్భంగా ఈ కొత్త రైతు చట్టాలను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కూడా ఏ భేషజాలకు పోకుండా యువతకు వెంటనే ఓ హామీ ఇవ్వండి. గొప్ప ప్రజా నాయకుడిగా, పాలకుడిగా విదేశాల్లో మెడల్స్ పొందితే సరిపోదు. వాటి గౌరవం కూడా కాపాడాలి.
బి.నర్సన్
94401 28169











