
ఒక వ్యాఖ్య దేశంలో చిచ్చురగిల్చింది. నిద్రాణమైన యువతను మేలుకొలిపింది. వారి చైతన్యానికి సవాల్ విసిరింది. వారి సహనానికి పరీక్ష పెట్టింది. వెరసి ఉవ్వెత్తున ఉద్యమ సెగలు లేవడానికి దోహదపడింది. పర్యవసానంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. యువత ఉద్యమానికి కేంద్రం దిగివచ్చింది పరీక్షల నిర్వహణ ప్రక్షాళనకు పూనుకొన్నది. మే నెల 15వ తేదీన భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విషయమై యువకులను (న్యాయవాదులను అని ఆయన ఉద్దేశం) ఉపాధి ఉద్యోగం లేని పరాన్న జీవులుగా, బొద్దింకలుగా అభివర్ణించారు. ఇది సహజంగానే యువతకు ఆగ్రహం కలిగించింది. తీవ్రంగా స్పందించిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక ఆన్‌లైన్ పార్టీ వెబ్‌సైట్ ప్రారంభించాడు. కొన్ని గంటలలోనే లక్షలు దాటి కోట్లకు చేరింది. దాని అభిమానుల సంఖ్య ఇంతింతై వటుడింతై అన్న రీతిలో దానికి స్పందన లభించింది జూన్ 15 కు అమెరికా నుండి జంతర్‌మంతర్ కేంద్రానికి చేరుకొని అభిజిత్ తన నిరసన ప్రారంభించాడు.
నీట్ యుజి పరీక్ష నిర్వహణలో జరిగిన అవినీతి అవకతవకలకు వ్యతిరేకంగా. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న నీట్ ఆశావహుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం కూడా డిమాండ్ చేశాడు. ఈ ఉద్యమానికి యువకులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ప్రతిపక్షాలు కూడా నైతిక మద్దతు ఇచ్చాయి. ఆరవ రోజు నుండి విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్షకు దిగడంతో ఉద్యమం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జులై 20 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ‘చలో సంసద్’ పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. అనేక అవరోధాలు ఆటంకాలు కల్పించింది. కానీ ఆగ్రహంతో ఉన్న యువత ఆ బారికేడ్లను లెక్కచేయక దూసుకుపోయింది.
వారి వీపులపై లాఠీలు విరిగాయి. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. విచక్షణారహితంగా కొట్టారు. ఆ విధంగా ఐదు రోజులు విపక్షాల మద్దతుతో పార్లమెంటు స్తంభించిపోయింది. కార్యకలాపాలు ఏవీ చేపట్టలేదు. ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన తన దీక్ష కొనసాగించాడు. ప్రధాన్ రాజీనామా చేసే వరకు చర్చల ప్రసక్తేలేదని ఉద్యమ నాయకులు తేల్చి చెప్పారు. జులై 25వ తేదీ మధ్యాహ్నం అనేక చర్చల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాతనే చర్చలకు సిద్ధమైన సిజెపి ప్రతినిధులు నీట్ బాధితులకు కోటి రూపాయల పరిహారం, పోలీసు కేసుల రద్దుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. మంగళవారం వరకు డెడ్‌లైన్ విధించారు. ప్రక్షాళన జరగాలని, పాలనా సంస్కరణలు చేపట్టాలని భవిష్యత్తులో కూడా తాము ఉద్యమాలు జరుపుతామని వారు ప్రకటించారు.
50ఏళ్ల క్రితం జయప్రకాష్ నారాయణ పిలుపుకు వచ్చిన స్పందన, 35ఏళ్ల క్రితం మండల్ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో జరిగిన ఆందోళనలు, తెలంగాణ తొలి మలిదశ పోరాటాలలో 1500 మందికి పైగా యువకులు ప్రాణాలర్పించడం, మళ్ళీ జంతర్‌మంతర్ వేదికగా యువత రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని ఎదిరించడం జరిగింది. సిజెపి ప్రకటించినట్లుగా ఇది అంతం కాదు ఆరంభంగానే మనం చూడవచ్చు. భవిష్యత్తులో కూడా వారు నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. వారి సమస్యలను సానుకూలంగా ఆలోచించని ప్రభుత్వం పోలీసులను రంగంలోనికి దింపింది. తద్వారా యువత మరింత రెచ్చిపోవడం జరిగింది. అనుగుణంగా ఆందోళనలు నిర్వహిస్తున్న యువత సహనానికి ప్రభుత్వం పరీక్ష పెట్టింది. కానీ యువత సంయమనం పాటించింది. తమను దేశద్రోహులుగా చిత్రీకరించినా, సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేసినా వారి విశ్వాసం సడలలేదు. వారి ఆత్మవిశ్వాసం ముందు ప్రభుత్వ కుతంత్రాలు, పోలీసుల దౌర్జన్యాలు పనిచేయలేదు. న్యాయం కోసం జరిపిన పోరాటంలో సఫలమయ్యారు. యువతులు, మహిళలు ఏ క్షణంలోనూ చలించలేదు. యువశక్తికి తిరుగులేదని నిరూపించారు. భవిష్యత్తు తమదేనన్నంత భరోసా కల్పించారు. భావి భారత ప్రజలకు మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
ఢిల్లీని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పూర్తిగా యువకులే. ప్రభుత్వంలోని అవినీతి, అసమర్థత, బాధ్యతారాహిత్యం వారిని ఉద్యమింపచేశాయి. ఇప్పుడు వారు విద్యలో సంస్కరణలే కాదు, రైతుల సమస్యల గురించి కూడా పోరాడడానికి సిద్ధమవుతున్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మన దేశీవాళి రైతుల ఉత్పత్తులను దెబ్బతీస్తాయని రైతు నాయకులు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే బొద్దింకలు సైతం అందుకు మద్దతు తెలిపి తాము కూడా ఉద్యమంలో పాల్గొనడానికి తయారయ్యాయి. అంటే తమ ఉద్యమాన్ని మరింత విస్తృత పరచే దిశగా వారు అడుగులేస్తున్నారు. భారతదేశపు సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంతర్జాతీయ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు. యువత ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. దేశ భవిష్యత్తును తామే నిర్ణయించాలని, నిర్దేశించాలని వారు పట్టుదలతో ఉన్నారు.
ప్రభుత్వ కవ్వింపు చర్యలు, పోలీసుల లాఠీ దెబ్బలు వారి ఆశయ సాధనలో అడ్డుకాలేదు. మందబలంతో, అహంకారంతో బుల్డోజ్ చేసే ఏ పనైనా యువతరం ముందు నిలవదు. ఈరోజు ఒక మంత్రి రాజీనామాతో ఈ ఆందోళన చల్లబడిందే కానీ ఆగలేదు. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది రాజీనామాలకు, విపరీత పరిణామాలకు దారి తీయనున్నదో కాలమే నిర్ణయించాలి. ఇప్పటివరకు జన్ ‘జి’, జన్ ‘జెడ్’ అన్నారు. ఇప్పుడు జన్ ‘ఆల్ఫా’ కూడా దూసుకు వస్తున్నది. వారి దూకుడుకు అడ్డుకట్ట వేయడం వృద్ధతరం వల్ల కాదు. కొత్త తరం ఆశయాలు, ఆకాంక్షలు గుర్తెరిగి విధానాల రూపకల్పన జరగాలి. అవినీతికి అవకాశం లేని వ్యవస్థ కోసం కోసమే వారి ఆరాటం. నిజంగా నిన్నటి ఉద్యమం జరగకపోతే పరీక్షల నిర్వహణకై పార్లమెంటులో చర్చ జరిగేదేనా? బిల్లు ఆమోదం పొందేదా? ఇక్కడే నూతన తరం సాధించిన విజయం స్పష్టం అవుతున్నది.
- శ్రీ శ్రీ కుమార్











