
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటి ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి తీరుతామని ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా కొన్ని వందల సార్లు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నొక్కి వక్కాణించిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలు ఆ బ్యారేజీ పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతాయని రెండున్నర ఏండ్లుగా చకోర పక్షుల్లా కోసం ఎదురు చూస్తున్నారు. గత రెండున్నర ఏండ్లలో తుమ్మిడిహట్టి వ్యవహారం కొయ్యగుర్రం లెక్కకిందకు మీదకు ఊగుతున్నదే తప్ప ముందుకు కదలడం లేదు. డిసెంబర్ 2023లో ఎక్కడ ఉండిందో అక్కడనే ఉన్నది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుకు కడతారా? లేక 151/150 మీటర్లకు కడతారా స్పష్టత లేదు. 2016లోనే 148 మీటర్ల గరిష్ట మట్టంతో బ్యారేజీ నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కాబట్టి 148 మీటర్లకు పైబడి ఏ ఎత్తుకు కట్టాలన్నా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం తప్పనిసరి అవసరం. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియదని అనుకోలేము. అయితే ఈ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగినట్టు సంకేతాలు అయితే ఏమీ లేవు. మొక్కుబడిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖలు రాసినట్టు, ఆయన నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదని పత్రికల్లో వాదోపవాదాలు మాత్రం మనం చూసినాము.
ఇకపోతే తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుకు బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం కుదిరినా కెసిఆర్ ప్రభుత్వం బ్యారేజీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధానదిపై బ్యారేజీ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? తెలుసుకుందాము. ప్రాణహిత -చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా వార్ధా, వైన్ గంగ నదుల సంగమం వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని ప్రతిపాదించారు. రెండు నదులకు అడ్డంగా 40 డిగ్రీల కోణంలో 6.5 కిమీ పొడవైన బ్యారేజీని నిర్మించాలి. డిజైన్ పరంగా, నిర్మాణ పరంగా ఇది అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా ఇంజినీర్లు భావించారు. మహారాష్ర్ట వైపు సంగమ స్థలాన్ని ఆనుకొని చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉండడంతో బ్యారేజీకి అనుమతులు సాధించడం కష్టం అని ప్రభుత్వం భావించింది. 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజీ నిల్వ సామర్థ్యం కేవలం 1.85 టిఎంసిలు మాత్రమే. ఆర్థికంగా 1.85 టిఎంసిల నిల్వకోసం సుమారు రూ. 2500 కోట్లు ఖర్చు పెట్టడం భావ్యం కాదని ప్రభుత్వం భావించింది. పై కారణాలను దృష్టిలో ఉంచుకొని వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటుందో అధ్యయనం చేయమని ప్రాజెక్టు ఇంజినీర్లను కోరడం జరిగింది. ఇంజినీర్లు ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. బ్యారేజీ స్థలాన్ని సంగమ స్థలానికి 3 కిలోమీటర్ల ఎగువన కౌటాలా మండలం, వీర్దండి గ్రామంవద్ద వార్ధా నది పైకి మార్చినందు వలన బ్యారేజీ నిర్మాణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, 20 టిఎంసిలు వినియోగించుకోవడానికి తగినంత నీటి లభ్యత ఉందని, ఇతరత్రా సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.
బ్యారేజీ పొడవు తుమ్మిడిహట్టి వద్ద మట్టికట్టలతో 6450 మీటర్లు ఉంటే అది వార్ధా పైన కుడి ఎడమ మట్టి కట్టలను కలుపుకొని 1751 మీటర్లకు తగ్గింది. కాంక్రీట్ స్ట్రక్చర్ పొడవు కేవలం 630 మీటర్లు మాత్రమే. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ గేట్ల సంఖ్య సుమారు 107. వార్ధాలో అది 21 కి తగ్గిపోయింది. తుమ్మిడిహట్టి బ్యారేజీలో 148 మీ ఎత్తు వద్ద నీటి నిల్వ సామర్థ్యం 1.85 టిఎంసిలు. వార్ధా బ్యారేజీలో 155 మీ ఎత్తు వద్ద నీటి నిల్వ సామర్థ్యం 2.94 టిఎంసిలు. తుమ్మిడిహట్టి బ్యారేజీకి ఎడమ వైపున చాప్రాల్వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి, జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి అనుమతులు సాధించడం కష్ట సాధ్యం. వార్ధా బ్యారేజీకి ఆ సమస్య లేదు.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని నదీ ప్రవాహానికి 40 డిగ్రీల స్క్యూ (skew)లో నిర్మించాలి. బ్యారేజీ గేట్లకు నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో రావాలంటే బ్యారేజీని డిజైన్ ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. ఇది సంక్లిష్టమైనది. మన దేశంలో గాని, ఇతర దేశాలలో గాని స్క్యూబ్యారేజీలు ఎక్కడా లేవు. ఇటువంటి బ్యారేజీల డిజైన్లను ఇంతకు ముందు ఎక్కడా రూపొందించలేదు. ఒకవేళ డిజైన్ రూపొందించినా ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది.
148 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టివద్ద ముంపు 1252.57 ఎకరాలు ఉంటే వార్ధా బ్యారేజీ వద్ద 1003.25 ఎకరాలకు తగ్గింది.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ఖర్చును 2007 -08 ఎస్‌ఎస్‌ఆర్‌తో లెక్కగట్టినప్పుడు రూ. 1919 కోట్లు. ఏటా 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తే అది ఇప్పుడు 2025 -26 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూ. 3646 కోట్లకు ఎగబాకుతుంది. 10% పెరుగుదలతో లెక్కిస్తే రూ. 5,373 కోట్లకు పెరుగుతుంది. వార్ధా బ్యారేజీ నిర్మాణ ఖర్చు 2023- 24 ఎస్‌ఎస్‌ఆర్‌తో లెక్కిస్తే సుమారు రూ. 800 కోట్లు మాత్రమే.
ప్రభుత్వం ప్రాథమిక నివేదికపై సమగ్రమైన చర్చ జరిపిన తర్వాత వార్ధా బ్యారేజీకి నిర్మాణానికి ఓకే చెప్పింది. డిపిఆర్ తయారు చేయించి కేంద్ర జల సంఘానికి అనుమతుల కోసం పంపించాలని ఇంజినీర్లను ఆదేశించింది. ప్రాణహిత -చేవెళ్ల డిపిఆర్ తయారు చేసిన వాప్కోస్‌కే 20 నవంబర్ 2021న జిఒ 410 జారీ చేసి వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణానికి డిపిఆర్ తయారు చేయమని ఆదేశించింది. వారు 2022- 23 ఎస్‌ఎస్‌ఆర్‌తో బ్యారేజీ సహా ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 4550.73 కోట్లతో డిపిఆర్‌ను తయారు చేసినారు. ఇందులో భూసేకరణ, బ్యారేజీ, గతంలో తవ్విన ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్ ఛానళ్ళు, కరకట్టలు, పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్‌స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులు, 18 శాతం జిఎస్‌టి.. తదితరాలు ఉన్నాయి. బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు డిపిఆర్‌ను 2023 మే నెలలో కేంద్ర జల సంఘానికి, ఇతర కేంద్ర సంస్థలకు సమర్పించడం జరిగింది. కేంద్ర సంస్థలనుంచి అనుమతులు రావడం కూడా మొదలయ్యింది.
2023 జూన్‌లో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జలబోర్డు అనుమతులు; ఆగస్టులో హైడ్రాలజీ, సెంట్రల్ విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతులు మంజూరు అయినాయి. డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో అనుమతుల ప్రక్రియ ఆగిపోయింది. ఆఖరుకు 2024 డిసెంబర్‌లో పాలమూరు సహా వార్ధా డిపిఆర్ కూడా వాపస్ వచ్చేసింది. ఇటు వార్ధా బ్యారేజీ పనులు, అటు తుమ్మిడిహట్టి పనులు ముందుకు సాగలేదు. అడపాదడపా మీటింగులు, సమీక్షలు, పత్రికా ప్రకటనలు తప్పితే తుమ్మిడిహట్టి పనులు అంగుళం ముందుకు కదలలేదు. మధ్యలో తుమ్మిడిహట్టి- ఎల్లంపల్లి కాస్తా తుమ్మిడిహట్టి- సుందిళ్ళగా మారింది. ఇసుక పునాది మీద కట్టిన సుందిళ్ళ బ్యారేజీ ఎప్పుడైనా కొట్టుకుపోతుందని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎల్లంపల్లికి కాకుండా నీటిని సుందిళ్ళకుతరలించాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటి? అధికారంలోకి వచ్చాక గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించడం సాధ్యం కాదన్న తత్వం బోధపడింది. కనుకనే సుందిళ్ళ రంగం మీదకు వచ్చింది.
ఏదిఏమైనా.. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ తుమ్మిడిహట్టి బ్యారేజీని 150/151మీటర్ల ఎత్తు వద్ద కట్టడానికి మహారాష్ట్రతో ఒప్పందానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. సంతోషం. ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాను. బ్యారేజీ నిర్మాణం అయి రైతాంగానికి నీరందడం ముఖ్యం. తుమ్మిడిహట్టి వద్ద ఏ ఎత్తులో కట్టినప్పటికీ నీటి లభ్యతలో మార్పు ఉండదు. కొంత ఎక్కువ నీటిని వినియోగించుకోవచ్చు. చాప్రాల్వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం సమస్య అట్లానే ఉంటుంది. మహారాష్ట్రను ఒప్పించాలి. డిజైన్, నిర్మాణ పరమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వానికి మిగిలి ఉన్న కాలం రెండున్నర సంవత్సరాలు. ఈ కాలంలో తుమ్మిడిహట్టి బ్యారేజీ పూర్తి అయి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి నీరందేనా? లేక కొయ్యగుర్రం వ్యవహారంగా మిగిలిపోతుందా? కాలం వెల్లడి చేస్తుంది.
శ్రీధర్‌రావు దేశ్పాండే
94910 60585
(రచయిత తెలంగాణ అస్తిత్వ వేదిక కో- ఆర్డినేటర్, విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ)











