
ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు ఇతర రిజర్వాయర్లకు త్వరలో నీరు విడుదల చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించుకున్నామని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. గ్రావిటీ ద్వారా వరద నీటి తీసుకుని వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు డిజైన్ చేశాయని ఆయన వివరించారు. కెసిఆర్ మాత్రం రివర్స్ పంపింగ్ పేరిట లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారని, దీని కోసం భారీ విదుత్తు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు వరద జలాలతో నిండిందని, దీనికి కెటిఆర్ ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ రాష్ట్రంలో కరవు ఉండాలని కోరుకుంటున్నదని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతలు దురాలోనతో ఉన్నారని ఆయన విమర్శించారు.
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు తనకు నెల రోజుల సమయం ఇస్తే నీళ్ళు ఎత్తిపోస్తానని పొంకనాలు కొట్టాడని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఎత్తిపోతలు లేకుండానే ఎల్లంపలికి నీళ్ళు వచ్చాయని, దీనికి హరీష్ రావు ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఉత్తర తెలంగాణ రైతులు అత్యధికంగా పంటలు పండిస్తున్నారని, అత్యధికంగా దిగుబడి వస్తున్నదని ఆయన వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్ చేసిన శ్రీపాద ఎల్లంపల్లి వల్లనే ఇది సాధ్యమైందన్నారు. రైతులు, ప్రజలు ఎందుకు సంతోషంగా ఉన్నారా? అని బిఆర్‌ఎస్ నాయకులు బాధ పడుతున్నారని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు ఇలా అన్ని ప్రాజెక్టులు తమ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా?, ఎప్పుడు కుర్చీలో కూర్చుందామా? అని ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు.
కెటిఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వచ్చి చూడాలని ఆయన డిమాండ్ చేశారు.కెసిఆర్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి కట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవన్నారు. వేల కోట్లు పెట్టి ప్రాణహిత-చేవేళ్ళ పనులు చేశాక ఆపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు పోనీయ్యలేదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో అడ్రసు గల్లంతు అవుతుంది జాగ్రత్త అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు.











