
మన తెలంగాణ/హైదరాబాద్: సంక్షేమ పథకాల పేరిట విచక్షణ లేకుండా ఉచితాలను వి స్తరించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో కి నెడుతుందని హైకోర్టు తీవ్ర ఆందోళన వ్య క్తం చేసింది. ఈ ధోరణి కొనసాగితే ఆర్థిక అ త్యవసర పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయ ని స్పష్టం చేసింది. అర్హతలతో సంబంధం లే కుండా పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై అసహజమైన భారం పడుతోందని పే ర్కొంది. హైకోర్టు జారీ చేసిన బెయిలబుల్ వా రెంట్ నేపథ్యంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం కోర్టు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక పై వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కో ట్ల బకాయిల చెల్లింపుల విషయంలో కోర్టు ఇ చ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టారు.
ఇప్పటికే రూ.25.70 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని సందీప్‌కుమార్ సుల్తానియా కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చి రెండేళ్లు దాటినా అమలు కాలేదని ఆక్షేపించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక పాలనలో సమిష్టి బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. సమాజంలో పౌరులు తమ బాధ్యతలను నిర్వర్తించని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే బాధ్యత వహించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ అప్పులు, వేతనాలు, ఇతర ఖర్చులు పోనివ్వగా మిగిలే మొత్తం చాలా పరిమితమని, అందులో అధిక భాగం సంక్షేమ పథకాలకే వెళ్తోందని హైకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు తరాలకు ఏం మిగులుతుందన్న ప్రశ్నను ప్రభుత్వం ఆలోచించాలంది. ఉచితాల అమలు విధానంపై లోపభూయిష్టంగా ఉందని, అనర్హులకు పెద్దవాట చేరుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఖరీదైన వాహనాలు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నవారే ఉచిత బియ్యం కోసం రావడం వంటి ఉదహరిచింది. ప్రభుత్వ సంక్షేమ ఉచిత పథకాల అమలులో లక్ష్యభ్రంశం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.
అర్హులైన వారికి సహాయం అందించడం తప్పుకాదని, అయితే కోటీశ్వరులకు కూడా రైతుబంధు వంటి పథకాలు అందడం వ్యవస్థలో లోపాలను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. సమాజంలో పని చేయాలనే మనస్తత్వం తగ్గిపోతున్నదన్న అంశంపై కూడా న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉచితాలపై అధిక ఆధారపడటం వల్ల ప్రజల్లో పనికి విలువ తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులపై పెరుగుతున్న కేసుల భారంపై కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కో అధికారిపై వేల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా అధికారిగా ఉన్నా సమర్థవంతంగా పని చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడింది. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం వంటి చర్యలపై కూడా కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. కుటుంబ ఆదాయానికి మించి ఖర్చు చేస్తే ఎలా సమస్యలు వస్తాయో, అదే విధంగా ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో కూడా నియంత్రణ అవసరమని సూచించింది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యయ నియంత్రణ అవసరమని స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలోనూ మార్పుల అవసరాన్ని కోర్టు ప్రస్తావించింది. చదువుపై దృష్టి తగ్గిపోవడం, విద్యార్థులు వ్యవస్థను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. కష్టపడి చదివే వారికి మాత్రమే సాయాన్ని కేంద్రీకరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అధిక శాతం కుటుంబాలు సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఈ విధానం దీర్ఘకాలంలో కొనసాగడం సాధ్యం కాదని కోర్టు హెచ్చరించింది. సమాజం మొత్తం ఉత్పాదకతను కోల్పోతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇది రాజకీయ వ్యాఖ్య కాదని, సాధారణ పౌరుడు వ్యక్తం చేసే ఆందోళనగా భావించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మొత్తం పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. చివరగా కంటోన్మెంట్ బోర్డు చెల్లింపుల అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు.








