ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 8 కోట్లు వసూలు చేసి మోసగించిన రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్ ను భద్రాచలం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కోర్ల కల్యాణ్ రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు తదితర ప్రాంతాల్లోని నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని బీటీపీఎస్ మణుగూరు, ఐటీసీ సారపాక కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. 54 మంది నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేశాడు. కానీ ఎవరికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో భద్రాచలానికి చెందిన రాయల శ్రీను పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌లో పది రోజుల క్రితం కేసు నమోదు చేశారు.

ఈ నెల 6వ తేదీన సాయంత్రం పోలీసులు భద్రాచలంలో కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడి భారీగా డబ్బులు నష్టపోయినట్లు విచరణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. బెట్టింగ్ కోసం తనకు తెలిసిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి డబ్బులు వసూలు చేశానని.. ఆ మొత్తాన్ని ఆన్ లైన్ బెట్టింగ్‌లో కోల్పోయానని నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై వివిధ ప్రాంతాల్లోనూ కేసులు నమోదయ్యాయని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సోమవారం కోర్ల కల్యాణ్ ను భద్రాచలం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం డీఎస్పీ ఎం.అరుణ్ కుమార్ సూచించారు.