
పలు రాష్ట్రాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూ బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును అనేక బ్యాంకు ఖాతాలు, నకిలీ సంస్థల ద్వారా బదిలీ చేస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అరెస్టయిన వారిలో ముఠా ప్రధాన నిర్వాహకుడిగా అనుమానిస్తున్న చేతన్ సెహ్రావత్ కూడా ఉన్నాడు. అరెస్టయిన మిగిలిన నిందితులను శక్తి గుజ్జర్, ధర్మేందర్ కుమార్, తరుణ్, దీపక్, గౌరవ్ కడియాన్‌గా గుర్తించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్నట్లు 89 ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయని, వాటిలో మొత్తం సుమారు రూ.83.23 కోట్ల మేర మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సకాలంలో తీసుకున్న చట్టపరమైన చర్యలతో రూ.1.14 కోట్లను ఆపగలిగినట్లు వెల్లడించారు.ద్వారకా నార్త్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో అనుమానాస్పద బ్యాంకు ఖాతా కనిపించింది.
తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులకు సంబంధించిన డబ్బు ఆ ఖాతాలోకి వచ్చినట్లు గుర్తించారు. దీంతో దర్యాప్తును విస్తరించగా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.నిందితులు అమాయకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, జీతాలు చెల్లించేందుకు బ్యాంకు ఖాతాలు అవసరమని చెప్పి వారి పేర్లపై ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ ఖాతాలను ‘మ్యూల్ అకౌంట్లు’గా ఉపయోగించి సైబర్ మోసాల ద్వారా వచ్చిన నగదును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మళ్లించేవారని తెలిపారు.“సెహ్రావత్ ఈ ముఠాకు ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నాం. అతని ఆధ్వర్యంలో మిగిలిన నిందితులు పనిచేశారు. వివిధ పేర్లతో బ్యాంకు ఖాతాలు, సంస్థలు ఏర్పాటు చేసి మోసపూరితంగా వచ్చిన నగదును వాటిలో జమ చేయడం, బదిలీ చేయడం, ఉపసంహరించుకోవడం చేసేవారు” అని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు.ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత సెహ్రావత్ థాయ్‌లాండ్‌కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్లినట్లు గుర్తించి అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
చివరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు తరుణ్ కూడా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతనిపై జారీ చేసిన లుక్‌అవుట్ సర్క్యులర్ ఆధారంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 12 సెల్‌ఫోన్లు, 109 చెక్‌బుక్‌లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, సంస్థల రిజిస్ట్రేషన్ పత్రాలు, పాన్, ఇతర గుర్తింపు పత్రాలు, నగదు జమ చేసిన రశీదులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.











