
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరొకరున తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ సోమవారంనాడు ఒక అధికారిక ప్రకటనలో ఖండించింది. గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన్ లియో నౌకపై జూలై 19న ఈ దాడి జరిగిందని, ఇందులో 5 మంది భారతీయులతో సహా 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని,
ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది.వాణిజ్య నౌకలను, పౌర సిబ్బందిని టార్గెట్ చేసుకోవడం, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటకం కలిగించడం ఎంతమాత్రం సరికాదని ఎంఈఏ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. పరిస్థితిని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిశితంగా గమనిస్తోందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది.











